రేగొండ, మే 15: కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. పంటను అమ్ముకోవడానికి మిల్లులు, కొనుగోలు కేంద్రాల వద్ద వారాల తరబడి పడిగాపులు కాస్తున్నా సర్కార్ కనికరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం లింగాల మిల్లు వద్ద శుక్రవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ధర్నా నిర్వహించగా మాజీ ఎమ్మెల్యే గండ్ర మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లింగాలలోని మిల్లు వద్ద ఎనిమిది రోజులుగా ట్రాక్టర్లలో ధాన్యం దిగుమతి కాకపోవడంతో రోజుకు రూ.2వేల చొప్పున రూ.16 వేలు రైతులు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల ఉసురు తగిలి కాంగ్రెస్ ప్రభుత్వ పతనం తప్పదన్నారు. ఎమ్మెల్యే, జిల్లా అధికారులు స్పందించి రెండు రోజుల్లో మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలన్నారు. లేకపోతే నిత్యం ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.