టేకుమట్ల, సెప్టెంబర్ 4 : ప్రజలను, రైతులను తప్పుదోవ పట్టించేందుకు కాంగ్రెస్ సర్కార్ కేసీఆర్‌పై కక్ష రాజకీయాలకు పాల్పడుతున్నదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. కేసీఆర్‌ను బద్నాం చేయాలనే కుట్రతోనే సీబీఐ విచారణ అంటూ డ్రామాలు ఆడుతున్నదని మండిపడ్డారు. రైతులకు సరిపడా యూరియా అందించాలని, కేసీఆర్‌పై సీబీఐ విచారణను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం జయశంకర్భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి రాస్తారోకో చేపట్టారు. అనంతరం అంబేద్కర్ సెంటర్లో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.
ఈ సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ప్రజాసంక్షేమం, రైతు సంక్షేమాన్ని మరిచి, కేసీఆర్ చేపట్టిన సంక్షేమాన్ని ప్రజలకు దూరం చేసిందని విమర్శించారు. ఘోష్ కమిషన్ ద్వారా చెత్త రిపోర్ట్‌ను తయారు చేయించి, సీబీఐ విచారణ జరపాలని నిర్ణయించడం దుర్మార్గమని అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్‌ను ప్రజల మనుసు నుంచి దూరం చేయలేరని స్పష్టం చేశారు. మోదీ, రేవంత్‌రెడ్డి కలిసి కేసీఆర్‌ను బద్నాం చేయాలనే కుట్రను ప్రజలు గమనిస్తున్నట్టు తెలిపారు.