హైదరాబాద్, నవంబర్ 20 (నమస్తేతెలంగాణ): ఈ-రేస్ తెచ్చి హైదరాబాద్ ఇమేజ్ పెంచిన కేటీఆర్‌ను కేసులతో వేధించాలని చూడటం దుర్మార్గమని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు. ఆయన ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి ఇవ్వడం బీజేపీ, కాంగ్రెస్ కుమ్మక్కు కుట్రలకు నిదర్శనమని పేర్కొన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో గురువారం మాజీ ఎంపీ బాల్క సుమన్, మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్, పార్టీ నేత శుభప్రద్ పటేల్‌తో ఆయన మీడియాతో మాట్లాడారు. పెట్టుబడులు సాధించిన కేటీఆర్‌పై బట్టకాల్చి మీద వేయాలని చూడటం బాధాకరమని పేర్కొన్నారు. బీఆర్ఎస్కు కేసులు కొత్తకాదని, కోర్టుల్లోనే తేల్చుకుంటామని స్పష్టంచేశారు. భూపాలపల్లి నియోజకవర్గంలో డబుల్ బెడ్రూం ఇండ్లను కాంగ్రెస్ కార్యకర్తలైన అనర్హులకు కేటాయిస్తున్నారని ఆరోపించారు.
ఈ-రేస్ కేసులో కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమంతిచడం మోదీ, రేవంత్‌రెడ్డి చీకటి ఒప్పందంలో భాగమేనని మాజీ ఎంపీ బాల్క సుమన్ ఆరోపించారు. కష్టాల్లో ఉన్న రైతాంగానికి కేటీఆర్, హరీశ్‌రావు అండగా నిలువడాన్ని ఓర్వలేకే సీఎం రేవంత్‌రెడ్డి కక్షసాధింపు చర్యలకు దిగుతున్నారని ధ్వజమెత్తారు. పాలనా వైఫల్యాల నుంచి దృష్టి మరల్చేందుకే ఇలాంటి చిల్లర ఎత్తుగడలకు దిగుతున్నారని దుయ్యబట్టారు. పత్తి కొనే దిక్కులేక గోసపడుతున్న రైతులను ఆదుకోవాల్సిన కాంగ్రెస్ సర్కారు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. గతంలో ఓటుకు నోటు కేసులో రూ.50 లక్షలతో అడ్డంగా దొరికిన రేవంత్‌రెడ్డి.. ఇప్పుడు కేటీఆర్‌పై అవినీతి బురద జల్లి జైలుకు పంపేందుకు చిల్లర ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దమ్ముంటే కేటీఆర్ సవాల్‌ను స్వీకరించి లైడిటెక్టర్ టెస్ట్‌కు సిద్ధం కావాలని డిమాండ్ చేశారు. కేటీఆర్‌పై అక్రమ కేసును కోర్టుల్లోనే తేల్చుకుంటామని స్పష్టం చేశారు.
ఈ- రేస్ తీసుకొచ్చి హైదరాబాద్ నగర ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన కేటీఆర్‌ను రాజకీయంగా దెబ్బతీసేందుకే కాంగ్రెస్ సర్కారు అక్రమ కేసు బనాయించిందని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి విమర్శించారు. ప్రధాని మోదీ డైరెక్షన్లో సీఎం రేవంత్‌రెడ్డి కేటీఆర్‌ను ఇబ్బంది పెట్టేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లో రాజకీయ లబ్ధికోసమే ఇలాంటి తప్పుడు కేసులను తెరపైకి తీసుకొస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారని, తగిన సమయంలో బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.