కృష్ణకాలనీ, జనవరి 5 : కాంగ్రెస్ పార్టీ(Congress party) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ అబద్ధం..చివరకు వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ఎకరానికి రూ.15వేలు ఇస్తానని మోసం చేసిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి(Gandra Venkataramana Reddy) రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కారల్ మార్క్స్ కాలనీలో బీఆర్ఎస్ అర్బన్ అధ్యక్షుడు కటకం జనార్దన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే సీఎం రేవంత్‌రెడ్డికి ఎన్నికలు నిర్వహించడం లేదన్నారు.
ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని గత్యంతరం లేని పరిస్థితులో శనివారం క్యాబినెట్ మీటింగ్ పెట్టి రైతు డిక్లరేషన్ చేసినట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో వరంగల్‌లో నిర్వహించిన సభలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రూ.15వేలు రైతు భరోసా ఇస్తామని రైతు డిక్లరేషన్ చేసి, ఇప్పుడు రూ.12వేలు ఇస్తానని రైతులను మోసం చేసిందని అన్నారు. రైతుల కిచ్చిన హామీల గురించి అడిగితే ప్రభుత్వం ముఖం చాటేస్తున్నదని మండిపడ్డారు.
అంతే కాదు.. రూ.2లక్షల రుణమాఫీ ఇప్పటి వరకు కొద్దిమందికి మాత్రమే జరిగిందన్నారు. రైతుభరోసా పూర్తిస్థాయిలో రుణమాఫీ, సన్న, దొడ్డు వడ్లకు రూ. 500బోనస్, వృద్ధులకు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు పెన్షన్లు, మహిళలకు రూ. 2,500, రూ.500కే గ్యాస్, నిరుద్యోగ భృతి, కల్యాణ లక్ష్మి తులం బంగారం పథకాలను ఎప్పుడు ఇస్తారో ప్రకటించి, కార్యాచరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ శబ్దం వెంకటరాణి సిద్దు, వైస్ చైర్మన్ గండ్ర హరీశ్ రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ నూనె రాజు పటేల్ పాల్గొన్నారు.