హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): సమస్యను వెంటనే పరిష్కరించాలని జీవో 46 బాధితులు శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌ను ముట్టడించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. నాడు కాంగ్రెస్ నేతలు ఆందోళనలకు పిలుపునిచ్చిన పోస్టర్లనే ప్లకార్డులుగా చేతబూని గాంధీభవన్ మెట్లపై కూర్చొ ని నినాదాలు చేశారు. శుక్రవారం గాంధీభవన్‌కు వచ్చిన మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని వారు ఘెరావ్ చేశారు. జీవో 46ను తక్షణం రద్దు చేయాలని, ఇక్కడే ప్రభుత్వ నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చి, ఉన్న 2 వేల కానిస్టేబుల్ పోస్టుల ఖాళీలను తమతో భర్తీచేయాలని, మరో 1,000 సూపర్ న్యూమరరీ పోస్టులను భర్తీ చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ‘మీ సమస్యపై ముఖ్యమంత్రితో మాట్లాడి చెప్తాను. ఎన్నికల్లో జీవో 46ను రద్దు చేస్తామని మీకిచ్చిన హామీ మాట వాస్తవమే. దీనికి కొంత సమయం పడుతుంది’ అని మంత్రి ఉత్తమ్ వారితో చెప్పారు. త్వరలోనే న్యాయం చేస్తామని బాధితులకు చెప్పి వెళ్లిపోయారు.