హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): ఓబుళాపురం అక్రమ మైనింగ్ కేసు దర్యాప్తు సందర్భంగా తన నుంచి సీబీఐ జప్తు చేసిన 57.89 కిలోల బంగారాన్ని తిరిగి ఇప్పించాలని నిందితుడు గాలి జనార్దన్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన బంగారాన్ని జప్తు చేయాలని కోర్టు ఎందుకు ఆదేశించిందో స్పష్టత లేదని, తన వాదనలు వినకుండా జప్తు జరిగిందని పేర్కొన్నారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని జస్టిస్ కే లక్ష్మణ్ మంగళవారం సీబీఐకి నోటీసులు జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 23కి వాయిదా వేశారు. ఓబుళాపురం అక్ర మ మైనింగ్ కేసులో జనార్దన్‌రెడ్డిని సీబీఐ కోర్టు ఇప్పటికే దోషిగా తేల్చింది.
రుణ ఎగవేత సివిల్ వివాదం ; పోలీసులు ఏజెంట్లు కాదు:హైకోర్టు
హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): రుణాలు ఇచ్చిపుచ్చుకున్న ప్రైవేటు వ్యక్తులు.. అవి వసూలు కాకపోతే పోలీసులు వసూలు చేయాలని కోరుతూ కోర్టులను ఆశ్రయించడం సబబు కాదని హైకోర్టు స్పష్టం చేసింది. రుణ ఎగవేతపై ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేయలేదంటూ బాధితుడు కోర్టుకు రావడాన్ని తప్పుపట్టింది. అప్పు ఇవ్వడం, దాన్ని తిరిగి చెల్లించకపోవడం అనేది సివిల్ వివాదమని స్పష్టం చేసింది. హైదరాబాద్ సైనిక్‌పురికి చెందిన దినేశ్ తన నుంచి తీసుకున్న అప్పును తీర్చకపోవడంపై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు చేయలేని సతీశ్ అనే వ్యక్తి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేయడంతో.. పోలీసులు రికవరీ ఏజెంట్లు కాదని జస్టిస్ టీ వినోద్‌కుమార్ తేల్చిచెప్పారు.