Gajwel | హైదరాబాద్ : సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ మాజీ ఎంపీపీ పద్మా నరేందర్‌తో పాటు వందకు పైగా నాయకులు, కార్యకర్తలు కారెక్కారు. ఈ సందర్భంగా వారందరికీ మాజీ మంత్రి హరీశ్‌రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక, విద్యార్థి వ్యతిరేక, ఉద్యోగ వ్యతిరేక విధానాలు పాటించడం సహించక బిఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నందుకు అభినందనలు తెలిపారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అని అన్ని వర్గాలను మోసం చేశారు రేవంత్ రెడ్డి అని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
రైతు బోనస్ బోగస్ చేశారు, 1300 కోట్లు పెండింగ్‌లో పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చాడు. నిరుద్యోగులు నోటిఫికేషన్ల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు అన్న మాట నీటి మూటలేయ్యాయి. పింఛన్లు పెంచడం దేవుడెరుగు, ఉన్న పింఛనల్లో కోత విధించారు. అభయహస్తం మేనిఫెస్టోలో మహాలక్ష్మి పేరిట ఇచ్చిన గ్యారెంటీలోని మొదటి హామీ ప్రతి మహిళకు నెలకు రూ.2500 గురించి ప్రస్తావన లేదు. చివరి గ్యారెంటీ చేయూతలో చెప్పిన రూ.4000 పింఛన్ గురించి ఒక్క మాట లేదు. ఇగ 420 హామీలకు దిక్కే లేదు. పరిపాలన గాలికి వదిలి, ప్రతీకార చర్యలకు ప్రభుత్వం దిగింది. పగ ప్రతీకారం తప్ప పాజిటివ్ యాటిట్యూడ్ లేదు ఈ ప్రభుత్వానికి. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కర్రు కాల్చి వాత పెడతరు అని హరీశ్‌రావు పేర్కొన్నారు.