హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ కేవలం ఒక రాష్ర్టానికి రాజధాని మాత్రమే కాదని, దేశ ఆర్థికవ్యవస్థకు మూలస్తంభం అని కేంద్రమంత్రి జీ కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’లో ఆయన మాట్లాడుతూ.. ఐటీహబ్, ఇన్నోవేషన్ కారిడార్, ఫార్మా క్యాపిటల్, ఏరోస్పేస్ టెక్నాలజీ సెంటర్‌గా హైదరాబాద్ వర్ధిల్లుతున్నదని తెలిపారు.
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ని మరింత పెంచేందుకు మనమంతా కలిసికట్టుగా కృషిచేయాలని పిలుపునిచ్చారు. పరిశ్రమలు, స్టార్టప్‌ల ఏర్పాటు, టాలెంట్, అంతర్జాతీయ పెట్టుబడుల ఆకర్షణలో రాష్ర్టాలు పోటీపడాలని సూచించారు. రాష్ర్టాల మధ్య పోటీతోనే సంస్కరణలకు వీలవుతుందని చెప్పారు. ప్రస్తుతం తెలంగాణ దేశంలోనే నాలుగో ఆర్థికవ్యవస్థగా ఉన్నదని గుర్తుచేశారు.
హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): గ్రీన్ అండ్ క్లీన్ మొబిలిటీ ద్వారా తెలంగాణను పర్యావరణహితమైన, ఆరోగ్యవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. సోమవారం ఆయన గ్లోబల్ సమ్మిట్‌లో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచుతామని తెలిపారు. తెలంగాణలో ప్రజారోగ్యం, ఆర్థిక వృద్ధి, ఇంధన భద్రత, పట్టణ నివాసయోగ్యతకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తున్నదని చెప్పారు.
2047 నాటికి తెలంగాణ జీరో-ఎమిషన్ మొబిలిటీలో దిక్సూచిగా ఎదగాలని ఆశిస్తున్నదని, ఆ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు రోడ్డు పన్ను, రిజిస్ట్రేషన్ రుసుములో 100% మినహాయింపు ఇస్తున్నామని వివరించారు. 2023 డిసెంబర్-2025 నవంబర్ మధ్యకాలంలో 1,59,304 ఈవీలకు రూ. 806.85 కోట్ల పన్ను రాయితీలు ఇచ్చామని, దీంతో ఈవీల వ్యాప్తి 1.39% పెరిగిందని వెల్లడించారు. రాష్ట్రంలో 37 ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్ (ఏటీఎస్)లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.