హైదరాబాద్, నవంబర్20 (నమస్తే తెలంగాణ): కాంట్రాక్టర్లకు వేల కోట్ల బిల్లులను చెల్లిస్తున్న ప్రభుత్వానికి.. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను చెల్లించేందుకు మాత్రం నిధులు లేవా? అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు. కాలేజీలు బంద్ పెట్టి ధర్నాలకు దిగుతున్నా సర్కారు పట్టించుకోకపోవడం సిగ్గుచేటని బుధవారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తంచేశారు.
బకాయిలు చెల్లించాలని మంత్రు లు, అధికారులను కలిసినా ఫలితం లేకుండా పోయిందని వాపోయారు. బిల్లుల కోసం రెండు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 1800 ప్రైవేట్ డిగ్రీ, జూనియర్ కాలేజీలకు తాళాలు వేయడం 76ఏండ్లలో ఎప్పు డూ జరగలేదని పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ పిల్లలు చదువుకునే కాలేజీలను మూసివేస్తే ప్రభుత్వం పట్టించుకోదా అంటూ నిలదీశారు. ఇప్పటికై నా ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.