Kerala Elections | కేరళ ఎన్నికలకు తెలంగాణ కాంగ్రెస్ చేస్తున్న హడావుడి.. రెండు నెలలుగా చూస్తూనే ఉన్నాం. అక్కడి ప్రచారానికి అవసరమైన నిధుల కోసం అధిష్ఠానం ఇప్పటికే రాష్ట్ర నేతలకు టార్గెట్లు పెట్టింది. ఆఖరికి ఎన్నికల ప్రచారానికి అసెంబ్లీ సమావేశాలను పక్కకునెట్టి మరీ తెలంగాణ మంత్రులు, నాయకులు కేరళకు పరుగులు తీశారు. అయితే ప్రచార అవసరాలకు తగ్గట్టుగా ప్రభుత్వ నిధులనూ కాంగ్రెస్ ముఖ్యులు ఉపయోగించుకున్నారని తాజాగా బయటపడింది. చిన్నాచితక కాంట్రాక్టర్లకు రావాల్సిన బకాయిలను, రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన బెనిఫిట్స్‌ను, ఆర్టీసీ, ఇతర శాఖలకు ఇవ్వాల్సిన నిధులను, వాయిదాల ద్వారా పోగుపడ్డ రైతుభరోసా పైసలను.. బడా కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపు కోసం వెచ్చించినట్టు సమాచారం. తద్వారా వచ్చే కమీషన్లను కేరళలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి మూటగట్టి పంపినట్టు అధికార పార్టీలోనే ప్రచారం జరుగుతున్నది.
హైదరాబాద్, ఏప్రిల్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నాచితక కాంట్రాక్టర్లను గోసపెట్టి, రిటైర్డ్ ఉద్యోగుల పొట్టలుగొట్టి, రైతు భరోసాను ఎగ్గొట్టి కేరళకు మూటలు మోస్తున్నదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ ప్రజల నోళ్లు కట్టేసి, పైసా పైసా కూడబెట్టి వంతుల వారీగా మంత్రులు మూటలు తరలిస్తున్నారని ప్రచారం జరుగుతున్నది.
మూడు నెలల నుంచి బడా కాంట్రాక్టర్లు, బడా బిల్లర్ల కంపెనీలకు మాత్రమే కాంట్రాక్టు బిల్లులు చెల్లించి, వాళ్ల నుంచి తీసుకున్న కమీషన్ సొమ్మును కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖర్చులకు పంపినట్టు ప్రచారంలో ఉన్నది. తెలంగాణ నుంచి రూ.1,200 కోట్లకు పైగా నిధుల సర్దుబాటు జరిగినట్టు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర ముఖ్యనేతలు అక్కడ ప్రచారం పేరుతో కొద్దిసేపు హడావుడి చేసి, ఆ తర్వాత సెల్‌ఫోన్ సిగ్నల్స్‌కు అందనంత రహస్య ప్రాంతాల్లో ఉండి ఎన్నికల ‘వ్యవహారాలను’ నడిపిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మూడు నెలలుగా రాష్ట్రంలో చిరు కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు ఆపేశారని, పలు ప్రభుత్వ శాఖలకు నిధుల బదిలీ నిలిపివేశారని సచివాలయంలో చర్చ జరుగుతున్నది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (జనవరి నుంచి మార్చి) రాష్ట్ర ప్రభుత్వం రూ.17,400 కోట్లు అప్పు తీసుకొచ్చింది. మొత్తంగా ఖజానాకు రూ.52 వేల కోట్లు ఆదాయం సమకూరింది. ఇందులో నుంచి జీతభత్యాలు, ప్రభుత్వ అప్పులకు వడ్డీలు మాత్రమే చెల్లించి, మిగతా మొత్తాన్ని మెగా కాంట్రాక్టర్లు, బడా బిల్డర్లకు బిల్లులు చెల్లించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
ఆయా కంపెనీలకు మూడు నెలల్లో రూ.45 వేల కోట్ల బిల్లులు చెల్లించినట్టు రాష్ట్ర ఖజానా విభాగం అధికారులు చెప్తున్నారు. ప్రతి చెల్లింపుపై సగటున 6 శాతం కమీషన్ తీసుకొని, నిధులు సమీకరించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ డబ్బులో కొంతభాగాన్ని విడతల వారీగా కేరళకు తరలించినట్టు కాంగ్రెస్ వర్గాల్లోనే చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 25 వేల మంది చిన్నాచితక కాంట్రాక్టర్లు రూ.50 వేల కోట్ల పనులు పూర్తిచేశారని, వారి బిల్లులు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని సచివాలయ వ ర్గాలు తెలిపాయి. తమకు బిల్లులు చెల్లిస్తే వారికి కమీషన్లు పెద్దగా రా వని, అందుకే వాటిని పెండింగ్‌లో పెట్టారని చిన్న కాంట్రాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల కొందరు ఎమ్మెల్యేలు రూ.50 కోట్లు, రూ.100 కోట్ల మేర కాంట్రాక్టు బిల్లులు పట్టుకొని ముఖ్యనేత వద్దకు వెళ్లగా.. ఆయన ఒక చిరునవ్వు నవ్వి.. ‘వందల కోట్ల బిల్లులు మీకు క్లియర్ చేసి, నేను అధిష్ఠానానికి ఏం పంపాలి?’ అని ప్రశ్నించినట్టు సమాచారం. ‘ఈ బిల్లులు మీ దగ్గరకు వచ్చాయంటే నేను రిజెక్టు చేయడమో? లేదా చెల్లింపుల్లో జాప్యం కావడం వల్లనో కాంట్రాక్టర్లు మిమ్మల్ని ఆశ్రయించి ఉంటారు’ అని చెప్పినట్టు తెలిసింది. అందుకే నెలకు రూ.5 కోట్లకు మించకుండా బిల్లులు తెచ్చుకోవాలని, లేదంటే తాను సహాయం చేయలేనని ఎమ్మెల్యేల ముఖంపైనే చెప్పినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
మూడు నెలల క్రితం మహిళా నేత ఒకరు రూ.300 కోట్ల కాంట్రాక్టు బిల్లుతోపాటు కాంట్రాక్టర్‌ను కూడా వెంటబెట్టుకొని ముఖ్యనేతను కలిసినట్టు తెలిసింది. ఆ ముఖ్యనేత 15 రోజుల్లోనే బిల్ క్లియర్ చేయించి కమీషన్ మాత్రం తానొక్కడే తీసుకొని, మహిళా నేతకు మొండిచెయ్యి చూపెట్టినట్టు కాంగ్రెస్ వర్గాల్లోనే చర్చ జరుగుతున్నది. ఇతర రాష్ర్టాల్లో కాంగ్రెస్ అవసరాలకు తెలంగాణ సొమ్మునే సర్దుబాటు చేస్తున్నారని చెప్పడానికి ఇంతకు మించిన ఉదాహరణ ఏముంటుందని ఒక సీనియర్ కాంగ్రెస్ నేత చెప్పారు.
2024 మార్చి నుంచి 2026 ఫిబ్రవరి వరకు 14 వేల మంది ఉద్యోగులు ఉద్యోగ విరమణ పొందారు. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్, జీపీఎఫ్, మ్యుటేషన్, గ్రాట్యుటీ, ఆర్జిత సెలవులు, గ్రూప్ ఇన్సూరెన్స్ వంటి ప్రయోజనాలు చెల్లించాల్సి ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఈ బెనిఫిట్స్ చెల్లించకపోవడంతో వైద్యం చెయించుకోలేక 80 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించినట్టు ఉద్యోగ సంఘాలు చెప్తున్నాయి.
654 మంది రిటైర్డ్ ఉద్యోగులు హైకోర్టులో పిటిషన్ వేయగా సర్కార్‌పై ధర్మాసనం ఆగ్రహం వ్యక్తంచేసింది. రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిని కోర్టుకు పిలిపించి చీవాట్లు పెట్టింది. నిధుల సమస్య కారణంగానే చెల్లింపులు ఆలస్యం అవుతున్నాయని ఆయన కోర్టుకు వివరించారు. ఏప్రిల్ 9వ తేదీ లోపు 2 వేల మందికి రిటైర్డ్ బెనిఫిట్స్ చెల్లిస్తామని చెప్పారు. ఇందుకోసం కొన్ని శాఖల్లో ఉద్యోగులకు ఈనెల జీతాలు నిలిపివేసినట్టు ఉద్యోగ సంఘాల నేతలు ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి.
ప్రభుత్వం ఆర్టీసీకి మహాలక్ష్మీ పథకం కింద రూ.4,448 కోట్లు బాకీ ఉన్నది. మార్చిలోనే ఈ నిధులు ఇవ్వాల్సి ఉన్నా, ఇప్పటివరకు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారు. ప్రభుత్వం నిధులు ఇవ్వకపోతే బస్సులు నడుపలేమని ఆర్టీసీ యాజమాన్యం మొండికేయడంతో గత నెల రూ.1,000 కోట్లు చెల్లించినట్టు చెప్తున్నారు. మిగతా నిధులు ఇవ్వకపోవడంతో ఉచిత ప్రయాణ భారాన్ని తగ్గించుకొనేందుకు ట్రిప్పుల్లో కోతలు పెట్టినట్టు ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. మెహిదీపట్నం నుంచి ఆరాంఘర్ మీదుగా ఉప్పల్ వరకు వెళ్లే 300 నంబర్ బస్సు సర్వీసులను రాత్రి 10 గంటల తర్వాత 80 శాతం ట్రిప్పులకు కోత పెట్టినట్టు ప్రయాణికులు చెప్తున్నారు.