హైదరాబాద్, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ఎట్టకేలకు నిధుల విడుదలకు మార్గం సుగమమైంది. ఇప్పటికే సుమారు రూ.30 కోట్ల వరకు విడుదల కాగా, 2-3 రోజుల్లో మరో రూ.75 కోట్ల వరకు మంజూరు కానున్నాయి. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం గతంలో కేటాయించిన రూ.175 కోట్లు విత్‌డ్రాయల్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం సులభతరం చేసింది. కరంట్ అకౌంట్ (ఏసీ) బిల్లుల రూపంలో 75 శాతం, డీటెయిల్డ్ వోచర్ (డీవీ) బిల్లుల రూపంలో 25 శాతం నిధులు పొందేందుకు అధికారులకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు బుధవారం రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా సవరణ ఉత్తర్వులు జారీచేశారు. ‘పైసా ఇవ్వకుండా ఎన్నికలు ఎలా?’ అనే శీర్షికన డిసెంబర్ 1న ‘నమస్తే తెలంగాణ’ కథనాన్ని ప్రచురించింది. చేతిలో చిల్లిగవ్వలేక ఎన్నికల ఖర్చులు పెట్టలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఎంపీడీవోలు పడుతున్న బాధలను కథనం కండ్లకు కట్టింది. ఈ కథనం నేపథ్యంలో సర్కారులో చలనం వచ్చింది. నిధుల విడుదలకు వెసులుబాటు కల్పించింది.
స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం గత సెప్టెంబర్‌లో రూ.315 కోట్లను కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇందులో రూ.150 కోట్లు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కోసం, మిగతా రూ.175 కోట్లు పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం కేటాయించారు. రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు స్టే ఇవ్వడంతో సెప్టెంబర్‌లో ఎస్ఈసీ జారీచేసిన స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రక్రియ నిలిచిపోయింది. నిధుల ఉత్తర్వులు వచ్చాయి తప్ప, విడుదల కాలేదని ఎంపీడీవోలు వాపోయారు. దాంతో 2025-26 బడ్జెట్ అంచనాల్లో భాగంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు విడుదల చేసిన రూ.175 కోట్ల నిధుల వినియోగ విధానాన్ని సవరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఏసీ బిల్లుల రూపంలో 75 శాతం నిధులు చెల్లించడానికి అనుమతి ఇచ్చింది. డీవీ బిల్లుల రూపంలో మిగతా 25 శాతం నిధులు చెల్లిస్తారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం డీసీ బిల్లులను సకాలంలో సమర్పించాలని పీఆర్ఆర్డీ డైరెక్టర్ అధికారులను ఆదేశించారు.
2024లో జరుగాల్సిన స్థానిక సంస్థల ఎన్నికల ఖర్చులకు అనుగుణంగా ప్రభుత్వానికి అప్పుడు రూ.315 కోట్లకు ప్రతిపాదనలు పంపామని పంచాయతీరాజ్‌శాఖ అధికారులు తెలిపారు. రెండేండ్లలో ఖర్చులు పెరిగిందున, గత షెడ్యూల్ ప్రక్రియకు సంబంధించిన వ్యయం కూడా ఉన్నందున అదనంగా మరో రూ.100 కోట్ల మంజూరు కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు పేర్కొన్నారు. సీలింగ్ ఎత్తివేసినందున ఖర్చులకు అనుగుణంగా బిల్లులను సకాలంలో పెట్టాలని సూచించారు. ఎన్నికల సిబ్బందికి పోలింగ్, ఇతర ప్రక్రియ పూర్తయిన వెంటనే డబ్బులు చెల్లించాల్సి ఉన్నందున ఏసీ బిల్లుల రూపంలో నగదు సమకూర్చుకోవాలని సూచించారు.