హైదరాబాద్, ఫిబ్రవరి 8(నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీలో జరిగిన అగ్ని ప్రమాదంతో వేలాది మంది నేరస్తులకు క్లీన్చిట్ ఇచ్చినట్టేనా? నేరాలను విశ్లేషించి, వాటి ఫలితాలను భద్రపరిచే సర్వర్రూమ్ కూడా కాలిపోవడమే ఇందుకు నిదర్శనమా? మళ్లీ ఆ ఆధారాలను సేకరించడం పోలీసులకు తలకు మించిన భారమేనా? అంటే అవుననే అంటున్నారు ఫోరెన్సిక్ ల్యాబ్ సిబ్బంది. పోలీసులు చెబుతున్నట్టు ఆధారాలను సాధ్యమైనంత త్వరగా రిట్రీవ్ చేయకపోతే నేరస్తులందరికీ క్లీన్చిట్ ఇచ్చినట్టేనని ‘నమస్తే తెలంగాణ’తో చెప్పారు. దీనిపై మరింత లోతుగా ఆరా తీయగా సర్వర్ రూమ్ కాలిపోవడంతో రూ.కోట్లు విలువజేసే సాఫ్ట్వేర్ కూడా అగ్నికి ఆహుతై ఉంటుందనే అనుమానాలు సిబ్బంది వ్యక్తం చేశారు. అంతకుమించి పలు కేసుల్లో నిందితులుగా ఉన్నవారిని నేరస్తులుగా నిరూపించడానికి ఈ ఆధారాలే అత్యంత కీలకమని.. కోర్టుకు సరైన ఆధారాలు సమర్పించకపోతే వాళ్లంతా తప్పించుకొనే ప్రమాదం ఉన్నదని ఓ ఎఫ్ఎస్ఎల్ రిటైర్డ్ ఉద్యోగి చెప్పారు. ఎఫ్ఎస్ఎల్ వంటి కీలక సైన్స్ ల్యాబ్‌లో ఇలాంటి ఒక ఘటన చోటుచేసుకోవడం ఇదే తొలిసారి అని ఆయన చెప్పారు. ఇది నిర్లక్ష్యం కాకపోవచ్చని.. కీలకమైన సర్వర్ రూమ్, కేస్ వెరిఫికేషన్, అనాలసిస్ చాంబర్లు తగలబడ్డాయంటేనే పలు అనుమానాలు కలుగుతున్నాయని చెప్పారు.
కీలకమైన చాంబర్లలోనే అగ్నికీలలు
ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో మొదటి రోజు నామమాత్రంగానే అగ్ని ప్రమాదం జరిగిందని చెప్పిన అధికారులు.. అదేరోజు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు ఎఫ్ఎస్ఎల్కు గుండెకాయ వంటి ఐదు రూముల్లో అగ్నిప్రమాదం చోటుచేసుకున్నదని చెప్పారు. వాటిల్లో కంప్యూటర్ ఫోరెన్సిక్ ప్రయోగశాల, అక్కడ సేకరించిన ఆధారాలను నిల్వ చేసే గది, కేస్ వెరిఫికేషన్ చాంబర్, ఆధారాలను విశ్లేషించే మరో చాంబర్, వాటన్నింటికీ సంబంధించిన సర్వర్ రూమ్‌లలో భారీగా నష్టం వాటిల్లిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వాటితో పాటు హెచ్ఆర్డీ హాల్లో ఫర్నిచర్, కంప్యూటర్లు, ఇతర పరికరాలు కూడా కాలిపోయినట్లు ఫిర్యాదులో తెలిపారు. ఇవే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు అత్యంత కీలకమని సిబ్బంది చెబుతున్నారు. పైన రెండో ఫ్లోర్లో కెమికల్ ల్యాబ్ ఉంటుందని, అక్కడ పరీక్షల్లో తేలిన వాస్తవాలను మొదటి ఫ్లోర్లో విశ్లేషించి.. అక్కడే భద్రపరుస్తారని చెబుతున్నారు. అయితే, ప్రమాదం రెండో ఫ్లోర్‌కు చేరుకుంటే.. ఒక కెమికల్ బాంబ్ పేల్చినంత ప్రమాదం వాటిల్లేదని అంటున్నారు. ఆ కెమికల్స్ ప్రమాదాన్ని త్వరగా కట్టడి చేసే వ్యవస్థ కూడా లేదని చెప్పారు.
సర్వర్ రూమ్‌లోనే డాటా స్టోరేజ్
ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌లో నేరాలను విశ్లేషించేందుకు గత ప్రభుత్వం రూ.కోట్ల విలువైన సాఫ్ట్వేర్లను కొనుగోలు చేసింది. విదేశాల్లో అప్డేటెడ్గా ఉన్న సాఫ్ట్వేర్లనే ఇక్కడా వాడుతున్నారని సిబ్బంది చెబుతున్నారు. ఏవైనా కేసులకు సంబంధించి దొరికిన పెన్‌డ్రైవ్‌లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, సెల్ఫోన్లు ఇతర డిజిటల్ సామగ్రిని విశ్లేషించి ఆ డాటాను సర్వర్‌కు పంపి, ఆ వస్తువులను ప్రాపర్టీ రూమ్‌లో నిల్వ చేస్తారు. ఇక కేసులను వెరిఫికేషన్ చేయడం, ఆ సమాచారాన్ని క్రోడీకరించి అనాలసిస్ రూమ్‌కు పంపుతారని నిపుణులు చెబుతున్నారు. ఆ అనాలసిస్ చాంబర్లో తేలిన ఫలితాలను సర్వర్‌లో భద్రపర్చి.. ఆయా స్టేషన్ల నుంచి పోలీసులు వచ్చినప్పుడు రిపోర్టులు ప్రింట్ తీసి, సంతకాలు చేసి, ఎవిడెన్స్ కాపీ దగ్గర పెట్టుకొని సీజ్డ్ ప్రాపర్టీ ఇచ్చేస్తారని చెబుతున్నారు. ఇంత విలువైన సర్వర్ రూమ్ కాలిపోవడం వెనుక బలమైన కారణాలే ఉండి ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సర్వర్ రూమ్ సహా నేరాలను విశ్లేషించే విలువైన సాఫ్ట్వేర్లు, కీలకమైన కేస్ వెరిఫికేషన్, కేస్ అనాసిస్ చాంబర్లకు కూడా మంటల్లో కాలిపోవడం అసాధారణమని నొక్కి చెబుతున్నారు.
భౌతిక, సాంకేతిక ఆధారాలు కూడా..
ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి రేప్, పోక్సో వంటి సంచలన కేసుల డీఎన్ఏ, సెమన్, వెంట్రుకలు, గోళ్లు వంటివి.. మర్డర్ కేసుల్లో రక్త నమూనాలు, ఫింగర్ ప్రింట్స్, అనుమానాస్పద కాల్ రికార్డింగ్స్, కాల్స్ విశ్లేషణ వంటి ఆధారాలు.. అనుమానాస్పద మృతి కేసులు, రైలు, రోడ్డు ప్రమాదాలుగా చిత్రీకరించే మర్డర్ కేసులు, గుర్తు తెలియని మృతదేహాల శాంపిల్స్, మిస్సింగ్ కేసులకు సంబంధించిన ఆధారాలు, ఆయా కేసుల్లో క్లూస్‌టీమ్ సేకరించే ఇతర భౌతిక ఆధారాలన్నీ అక్కడే వస్తుంటాయి. ఇక కొన్ని అరుదైన సైబర్ నేరాలు, ఫోన్ ట్యాపింగ్‌లు, ఆడియో, వీడియో వంటి విశ్లేషన్లు, ఫోన్ వాయిస్ రికార్డింగులు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్‌డిస్క్‌లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, ఇతర సాంకేతికత డిజిటల్ సామగ్రి కూడా ఎఫ్ఎస్ల్కు విశ్లేషణకు వస్తాయి. ఈ ఒక్క ఘటనతో ఎన్నో వేల కేసులకు సంబంధించిన భౌతిక, సాంకేతిక ఆధారాలు అగ్నికి ఆహుతి అయ్యాయని తెలుస్తున్నది.
రోజుకు సగటున 700కుపైగా నేరాలు
రాష్ట్రవ్యాప్తంగా నానాటికీ క్రైమ్ పెరిగిపోతున్నది. పోలీసు అధికారిక లెక్కల ప్రకారం.. 12 నెలల్లో సుమారు 3లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. రోజూ సగటున 650 నుంచి 700 వరకూ ఆయా స్టేషన్లవారీగా నేరాలు నమోదవుతున్నట్లు పోలీసు శాఖ విడుదల చేసిన లెక్కలు చెబుతున్నాయి. 2024లో క్రైమ్ రేట్ ఏకంగా 23శాతం పెరిగింది. 2025లో 20శాతంగా నమోదైంది (2023తో పోల్చితే). తెలంగాణలో వివిధ విభాగాల్లో కలిపి రోజుకు 10వరకూ రేప్ కేసులు రికార్డ్ అవుతున్నాయి. వాటిల్లో 3 పోక్సో కేసులు ఉంటున్నాయి. ఇక రోజుకు సగటున 3 హత్యలు జరుగుతున్నాయి. వీటితో పాటు పలు ఆర్థిక నేరాలు, గుర్తుతెలియని మృతదేహాలు, రోడ్డు/రైలు ప్రమాదంగా చిత్రీకరించే మరణాలు వంటివి ప్రతిరోజూ ఎఫ్ఎస్ఎల్కు సుమారు 150-200 వరకూ నేరాల విశ్లేషణకు సంబంధించిన రిపోర్టులు వస్తాయని అంచనా.
తెలంగాణతో పాటు ఆయా రాష్ర్టాల కేసులు, ప్రత్యేకంగా కొన్ని కీలక కేసుల్లో సుప్రీంకోర్టు, హైకోర్టులు తెలంగాణ ఎఫ్ఎస్ఎల్కు పంపే కేసులు, సీబీఐ, ఎన్ఐఏ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు పంపే కొన్ని కేసులు ఉంటాయి. వాటిని విశ్లేషించి.. వాస్తవాలను సీల్డ్కవర్లో ఇవ్వాల్సిన బాధ్యత ఎఫ్ఎస్ఎల్ అధికారులకు ఉంటుంది. అయితే, తమ వద్దకు వచ్చిన ఆయా కేసులను 15 రోజుల నుంచి నెల రోజుల వ్యవధిలో పరిష్కరిస్తుంటారు. కొన్ని కేసుల్లో గరిష్టంగా 50 రోజుల వరకూ తీసుకుంటారని సమాచారం. ఈ ప్రమాదం జరుగక ముందు 50రోజుల డాటా నుంచి 7వ తేదీ వరకూ ఎన్ని కేసులు రిపోర్టు అయ్యాలయనే లెక్కలను అధికారులు వివరంగా చెప్పలేదు. ఈ 50 రోజుల్లో నమోదైన కేసులు, వాటి క్రైమ్ నంబర్లు, ఆధారాలు, ఇతర ఎవిడెన్స్‌లు అన్నీ కాలిపోయాయా? అనేది ప్రకటించలేదు. దీంతో ఇన్ని రోజులుగా ఎఫ్ఎస్ఎల్లో ఉన్న రిపోర్టులు, ఆధారాలు కాలిపోతే ఆయా కేసుల్లో నేరస్తులందరికీ క్లీన్చిట్ ఇచ్చినట్టే అవుతుందనేది విశ్లేషకులు వాదన.