హైదరాబాద్ : సీఎం రేవంత్‌రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుతో దోస్తీ కట్టి తెలంగాణకు అన్యాయం చేస్తున్నడని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. చంద్రబాబుతో దోస్తీ కోసం రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న రేవంత్‌రెడ్డిని తెలంగాణ సమాజం క్షమించదని అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం తెలంగాణ భవన్లో ప్రెస్‌మీట్ పెట్టి హరీష్‌రావు మాట్లాడారు. కేసీఆర్ హయాంలో కేంద్రానికి 10 డీపీఆర్‌లు పంపి ఏడు ప్రాజెక్టులకు అనుమతులు తెచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ రెండేళ్లలో కాంగ్రెస్ ఒక్క అనుమతి కూడా తేలేదని ఎద్దేవా చేశారు.
‘ఢిల్లీ మీటింగ్‌కు వెళ్లేందుకు ఆదిత్యనాథ్ మినహా తెలంగాణ సోయి కలిగిన ఒక్క ఇంజినీర్ దొరకలేదా..?’ అని హరీష్‌రావు ప్రశ్నించారు. ఆయనేమన్నారో ఆయన మాటల్లోనే.. ‘మన తెలంగాణ నీళ్లను ఏపీకి తీసుకువెళ్లే కుట్ర ఇది. తెలంగాణ సోయి ఉన్న ఒక్క ఇంజినీర్ దొరకలేదా..? దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నట్లు చేస్తున్నారు. పోనుపోను అంటూనే మీటింగ్‌లకు అటెండ్ అవడం ఏమిటి..? తెలంగాణ నీటి హక్కులను గంపగుత్తగా ఏపీకి అప్పజెప్పడమే మీ చర్చల లక్ష్యమా..?’ అని ప్రశ్నించారు.
‘కేసీఆర్ హయాంలో గోదావరిలో 400 టీఎంసీలకు కేంద్రం నుంచి అనుమతులు తెచ్చారు. గోదావరి మీద 10 డీపీఆర్‌లు పంపి.. 7 ప్రాజెక్టులకు అనుమతులు సాధించారు. రెండేళ్లలో ఒక్క డీపీఆర్ పంపింది లేదు. ఒక్క అనుమతి తెచ్చింది లేదు. వార్దా, కాళేశ్వరం మూడు టీఎంసీలకు సగం అనుమతులు వస్తే, పూర్తి చేయకుండా డీపీఆర్‌లు వాపస్ చేసింది. రేవంత్‌రెడ్డి పాలనలో డీపీఆర్‌లు వాపస్ వచ్చిన పరిస్థితి. నువు మన డీపీఆర్‌లు వాపస్ తెచ్చుకుంటవు, నల్లమలసాగర్‌కు జెండా ఊపుతవు. అలాంటి చంద్రబాబుతో దోస్తీ కట్టి, తెలంగాణకు తీరని అన్యాయం చేసేందుకు సిద్ధమైన రేవంత్ రెడ్డీ నిన్ను తెలంగాణ సమాజం క్షమించదు’ అని హరీష్‌రావు వ్యాఖ్యానించారు.