కృష్ణ కాలనీ, జూన్ 2: 2018లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తనకిచ్చిన భూమికి ఫారెస్ట్ అధికారులు అడ్డుపడుతున్నారని, తనకు కలెక్టర్ సార్ న్యాయం చేయాలని ఓ స్వాతంత్య్ర సమరయోధురాలు వేడుకుంది. సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేదర్ సెంటర్లో నాగారం గ్రామానికి చెందిన గౌరు మల్లక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన తెలిపింది. ఈ సందర్భంగా మల్లక మాట్లాడుతూ.. 2018లో రాష్ట్ర అవతరణ దినోత్సవం నాడు అప్పటి సీఎం కేసీఆర్ స్వాతంత్య్ర సమరయోధులకు వ్యవసాయ భూములను ఇచ్చారని గుర్తుచేశారు. ఈ క్రమంలో తనకు మహాముత్తారం మండలంలో సర్వే నంబర్ 347లో 10 ఎకరాల భూమిని కేటాయించారని తెలిపారు.
తహసీల్దార్, ఆర్డీవోలు వచ్చి హద్దులు పెట్టి భూమిని డిక్లేర్ చేశారని, పట్టాపాస్ బుకు త్వరలోనే ఇస్తామని హామీ ఇచ్చినా ఇప్పటికీ ఇవ్వకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు ఆవేదన వ్యక్తంచేశారు. కొంతకాలంగా ఫారెస్ట్ అధికారులు ఈ భూమి రిజర్వ్ ఫారెస్ట్దని అడ్డుకోవడంతో మళ్లీ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశానని తెలిపారు. జాయింట్ సర్వేయర్‌కు నివేదికి మేరకు అది రెవెన్యూ భూమేనని స్పష్టం చేసి, తనను సాగు చేసుకోమని సూచించారని పేర్కొన్నారు. పట్టా పాస్ బుకు ఇవ్వాలని ఆరేళ్లుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉన్నామని, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంనాడైనా న్యాయం చేయాలని జిల్లా కేంద్రంలోని అంబేదర్ సెంటర్లో నిరసన తెలిపామని పేర్కొన్నారు. ఇప్పటికైనా కలెక్టర్ రాహుల్‌శర్మ, భూపాలపల్లి ఆర్డీవో స్పందించి తనకు పట్టాపాస్‌బుక్ ఇచ్చి న్యాయం చేయాలని కోరారు. భూపాలపల్లి సీఐ నరేశ్‌కుమార్, ఎస్ఐలు, ఆర్డీవో రవి చేరుకుని మంగళవారం ఈ విషయం కలెక్టర్ రాహుల్‌శర్మ దృష్టికి తీసుకెళ్తామని చెప్పడంతో మల్లక ఆందోళన విరమించారు.