
ఒక రైతుకు రెండు బర్రెలు ఉన్నయ్.. ఒక బర్రె మీద రోజూ 250 దాకా ఖర్చు పెడ్తుండు ది రోజుకు ఒక లీటరు పాలు కూడా ఇస్తలేదు.. రెండో బర్రె మీద దినాం రూ.80 ఖర్చు పెడ్తుండు.. అది రోజుకు 3, 4 లీటర్ల దాకా పాలు ఇస్తున్నది ఇది చూసిన తోటి రైతులు పాలిచ్చే బర్రెకు.. బలవర్ధక మేత వేసి మంచిగ జూస్కుంటే.. మరింత ఎక్కువ పాలు ఇస్తదని సలహా ఇచ్చిండ్రు.. ఈ ఆలోచన బాగానే అనిపించింది ఆ రైతుకు.. అచ్చంగా సీఎం కేసీఆర్ చేసిన ప్రతిపాదన కూడా ఇలాంటిదే. అదే వ్యవసాయ రంగానికి దేశమంతా ఉచిత విద్యుత్తు ప్రకటన. సదరు రైతన్నకు తోటి రైతులు జెప్పిన పైమాటల్లో తప్పేమైనా ఉందా? బీజేపీ నేతలకు మాత్రం తప్పులే కనిపిస్తున్నయ్..

(స్పెషల్ టాస్క్ బ్యూరో- నమస్తే తెలంగాణ)
హైదరాబాద్, సెప్టెంబర్ 7: దేశ రైతాంగాన్ని ఆదుకోవడానికి, పెట్టుబడి వ్యయం తగ్గించడానికి, సాగుభూముల్లో జలకళ నింపడానికి దేశమంతా వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేసిన ప్రకటన ఆచరణ సాధ్యం కాని హామీగా బీజేపీ నేతలు అంటున్నారు. కానీ, కేసీఆర్ ప్రకటన ఆచరణయోగ్యమైనదని, ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్తే అమలు సులభసాధ్యమేనని ఆర్థిక, వ్యవసాయరంగ నిపుణులు చెప్తున్నారు.

బడ్జెట్లో 4 శాతం కూడా కాదు
దేశంలో ఉత్పత్తయ్యే మొత్తం విద్యుత్తులో 54.46 శాతం వినియోగించుకుంటున్న తయారీ పరిశ్రమల రంగం దేశ స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ)లో 14.43 శాతం వాటాను కలిగి ఉన్నది. ఇదే సమయంలో 20.8 శాతం విద్యుత్తు మాత్రమే వినియోగించుకుంటున్న వ్యవసాయరంగం వాటా జీడీపీలో 20.19%. అంటే ఎక్కువ విద్యుత్తు వినియోగిస్తున్న తయారీ పరిశ్రమలు ఆర్థికాభివృద్ధికి తక్కువ తోడ్పాటు అందిస్తుండగా, పరిమితంగా వినియోగిస్తున్న వ్యవసాయరంగం ఎక్కువగా తోడ్పాటు అందిస్తున్నది. అందుకే సాగుకు ఉచిత విద్యుత్తు ఇవ్వటం ద్వారా దేశాభివృద్ధికి బాటలు వేద్దామని కేసీఆర్ భావిస్తున్నారు.
వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు అందిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, దీనికయ్యే ఖర్చు కేంద్ర బడ్జెట్లో 3.67 శాతమే ఉంటుందని ఆర్థికరంగ నిపుణులు చెప్తున్నారు. తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్తు అందిస్తుండగా ఏపీ, పంజాబ్, తమిళనాడులో కొన్ని నిబంధనలతో ఉచిత విద్యుత్తును సరఫరా చేస్తున్నారు. కర్ణాటకలో అమలులో జాప్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్, జార్ఖండ్, మహారాష్ట్రలోని తూర్పు ప్రాంతం, పశ్చిమబెంగాల్ పశ్చిమ ప్రాంతాల్లో తీవ్ర నీటి ఎద్దడి పరిస్థితులు ఉన్నాయి. బోర్ల సాయంతోనే వ్యవసాయం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో అధిక విద్యుత్తు చార్జీలతో రైతన్నలు వ్యవసాయాన్నే విడిచిపెట్టే పరిస్థితులున్నాయని సర్వేలు చెప్తున్నాయి. ముఖ్యంగా యూపీ, మధ్యప్రదేశ్‌లోని 13 జిల్లాలు కలిగిన బుందేల్‌ఖండ్ ప్రాంతంలో కరువు వికటాట్టహాసం చేస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు ప్రకటన అన్నదాతలకు ఎంతో ఊరట కలిగిస్తున్నది. కేసీఆర్ తాజా ప్రకటనతో బీజేపీ పాలిత రాష్ర్టాలకే ఎక్కువ ప్రయోజనం చేకూరనున్నది. అయినా బీజేపీ నేతలు సొంతింటి బాగుకే మోకాలడ్డుతున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.