శనివారం 06 జూన్ 2020
Telangana - May 16, 2020 , 19:50:18

ఉపాధి కోల్పోయిన దర్జీలకు నిత్యావసరాల పంపిణీ

ఉపాధి కోల్పోయిన దర్జీలకు నిత్యావసరాల పంపిణీ

హైదరాబాద్‌: కరోనా విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో అధైర్యపడకుండా ఉండాలని, ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అండగా నిలుస్తాయని రాష్ట్ర బీసీ కమిషన్‌ పూర్వ సభ్యులు డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌ రావు అన్నారు. ఆరోగ్యాన్ని రక్షించుకునే సందర్భంలో ఏమాత్రం నిర్లిప్తత తగదని ఆయన సూచించారు. కుట్టు పని ద్వారా ఉపాధి పొందే కార్మికులు లాక్‌డౌన్‌ కారణంగా ఇబ్బందులు పడుతున్నారు. వృత్తిని కోల్పోయిన కార్మికుల కుటుంబాల పరిస్థితులను గమనంలోకి తీసుకొని రాష్ట్ర మేరు సంఘం ఆధ్వర్యంలో అంబర్‌పేటలో శనివారం నిత్యావసర సరుకుల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ సంఘం నాయకులు సంగేవార్‌, పవన్‌, చంద్రపాల్‌ల సౌజన్యంతో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా వకుళాభరణం పాల్గొన్ని నిత్యావసరాలు పంపిణీ చేశారు.

పెద్ద ఎత్తున తరలి వచ్చిన నగరంలోని దర్జీల కుటుంబాలకు బియ్యం, కంది పప్పు, నూనె, పిండి తదితరాలతో కూడిన ప్యాకెట్‌ను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్‌ వకుళాభరణం మాట్లాడుతూ అన్ని బీసీ కులాలలో వృత్తులు, పనిని కోల్పోయిన వారికి, పేద కుటుంబాలకు సరుకులు ఉచితంగా పంపిణీ చేయడానికి దాతలు ముందుకు రావాలని కోరారు. ఇది మానవీయ కోణంలో స్పందించాల్సిన సమయం అని అన్నారు. కార్యక్రమంలో ఉచితంగా సరుకులందించిన సేవకులు రచ్చ శ్రీనివాస్‌, జి.సాయి కుమార్‌, తదితరులు పాల్గొన్నారు. logo