హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ) : మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి చిప్‌తో కూడిన స్మార్ట్‌కార్డులు ప్రవేశపెట్టేందు కు రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతున్నది. అదిగో, ఇదిగో ఇస్తాం.. అంటూ ఊదరగొడుతుందే తప్ప.. అమలు చేయడమే లేదు. కార్డు ల జాప్యం కారణంగా టికెట్ల జారీలో ఏర్పడుతున్న సమస్యలకు కండక్టర్లను బాధ్యులుగా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్మార్ట్‌కార్డులు ఇంకెప్పుడు ఇస్తారు? అని కండక్టర్లు, డ్రైవర్లు అడుగుతున్నారు. ప్రస్తుతం మహిళలు తమ ఆధార్ కార్డును చూపించి బస్సుల్లో జీరో టికెట్ తీసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన ఎందరో మహిళలు నకిలీ, స్థానిక చిరునామా లేని ఆధార్ కార్డులతో హైదరాబాద్ సహా రాష్ట్రవ్యాప్తంగా నిత్యం ఉచిత ప్రయాణం చేస్తున్నట్టు ఆర్టీసీకి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో చిప్‌తో కూడిన స్మార్ట్‌కార్డులను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ స్మార్ట్‌కార్డులు మహిళల చేతికొస్తే.. సులభంగా సాన్ టికెట్ పొందడంతో పాటు, నకిలీ ఆధార్ ప్రయాణాలను అరికట్టవచ్చనే అభిప్రాయం అందరిలోనూ వ్యక్తమైంది. దీంతో స్మార్ట్‌కార్డుపై అటు మహిళల్లోనూ, ఇటు ఆర్టీసీ సిబ్బందిలోనూ ఆసక్తి నెలకొన్నది. కానీ, ప్రభుత్వం ఏడాది నుంచి జాప్యం చేస్తూ వస్తున్నది. కార్డుల్లేని కారణంగా చిన్నచిన్న సమస్యలకే డిపో మేనేజర్లు చర్యలు తీసుకుంటున్నారని సిబ్బంది వాపోతున్నారు.
మహాలక్ష్మీ పథకం ప్రారంభమైన 2023 డిసెంబర్ 9 నాటి నుంచే మహిళల కోసం స్మార్ట్ కార్డులు ప్రవేశపెట్టాలనే ప్రస్తావన ఉన్న ది. గత ఏడాది చివర్లో పథకం సాధించిన విజయాలను వివరిస్తూ త్వరలోనే స్మార్ట్‌కార్డుల ద్వారా వ్యవస్థను ఆధునీకరిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ ఏడాది మొదట్లో నిర్వహించిన అసెంబ్లీ సమావేశాల్లోనూ స్మార్ట్‌కార్డులపై మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ స్పష్టతనిచ్చారు. త్వరలోనే చిప్ ఆధారిత స్మార్ట్‌కార్డుల కోసం టెండర్లు పిలిచామని, ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి వీటిని పరీక్షిస్తామని స్పష్టంచేశారు. తెలంగాణలో దాదాపు కోటి మందికిపైగా మహిళలకు ఈ కార్డులు జారీ చేయాల్సి ఉంటుంది. అర్హులైన లబ్ధిదారుల డాటాను తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, విద్యాశాఖ, ఆరోగ్యశాఖ, స్వయం సహాయక సంఘాల డాటాబేస్‌ల నుంచి సేకరించి, క్లబ్ చేయడం పెద్ద సవాల్‌గా మారిందని ఆర్టీసీ వర్గాలు చెప్తున్నాయి. మహిళలకు కేవలం కార్డులిస్తే సరిపోదని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది బస్సుల్లోని కండక్టర్ల వద్ద కొత్త ఐటిమ్ సాఫ్ట్వేర్, స్మార్ట్‌కార్డ్ రీడర్లను అందుబాటులోకి తేవాలి. దీంతోనే పైలెట్ ప్రాజెక్టు కూడా మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నదని తెలిసింది.