Auto Driver | బాన్సువాడ, మే 4: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫ్రీ బస్ పథకం.. ఆటో డ్రైవర్ల జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. గిరాకీ తగ్గడంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఆదాయం లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. ప్రభుత్వం తమకు ప్రత్యామ్నాయ మార్గాలను చూపి, ఆదుకోవాలని కోరినా పట్టించుకునేవారే కరువయ్యారు. ఫ్రీ బస్సు పథకంతో తాము ఉపాధి కోల్పోయి విషం తాగేపరిస్థితి వచ్చిందంటూ నిజామాబాద్ జిల్లా వర్ని మండలం ఆక్బర్నగర్కు చెందిన ఆటో డ్రైవర్ ఇమ్రాన్ ఆవేదన వ్యక్తంచేశాడు.
తన ఆర్థిక ఇబ్బందులను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తన ఆరేండ్ల కుమారుడుని ఎత్తుకొని, చేతిలో ఫ్లెక్సీ పట్టుకొని సీఎం రేవంత్‌రెడ్డిని కలవడానికి కాలినడకన బయల్దేరాడు. ఆదివారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణానికి చేరుకున్న ఇమ్రాన్.. స్థానిక విలేకరులతో తన గోడును వెళ్లబోసుకున్నాడు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని మండిపడ్డాడు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడంతో తమ జీవనోపాధి దెబ్బతిన్నదని ఆరోపించాడు. తమ కుమారుడి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తన కుటుంబ పరిస్థితిని ప్రభుత్వానికి వివరించడానికి కాలినడకన బయల్దేరినట్టు వివరించాడు.