సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/సిటీబ్యూరో, జనవరి 7(నమస్తే తెలంగాణ): హనుమంతుడిని చేయబోతే కోతి అయిందట! ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో పరిస్థితి ఇట్లనే తయారైంది. ‘నేను చేపట్టిన మెట్రో టేకోవర్ చూసి కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ఆశ్చర్యపోయారు’ అని కొన్నిరోజుల కిందట సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రగల్బాలకు పోయారు. కానీ టేకోవర్ అమల్లో మాత్రం అధికార యంత్రాంగానికి దిమ్మ తిరిగిపోతున్నట్లు తెలిసింది. అతి చవక ధరకు మెట్రో మొదటి దశను స్వాధీనం చేసుకున్నామని సర్కార్ పైకి సంబురాన్ని వ్యక్తం చేస్తున్నా… వాస్తవ లెక్కలు తేలిస్తే ఎల్అండ్టీకి ఆర్థికంగా భారీ ఊరటనిచ్చి ప్రభుత్వం అనాలోచిత నిర్ణయంతో ప్రజలపై పెను భారాన్ని మోపుతున్నట్లు ఇప్పటికే తేలిపోయింది. అయితే భారం సంగతి ఎలా ఉన్నా… అసలు టేకోవర్‌ను పూర్తి ప్రక్రియ అధికారులకు కత్తి మీద సాములా తయారైంది. వంద రోజుల్లో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధికారులకు గడువు విధించినా నిధులు సమకూర్చడం అసాధ్యమని అధికారికవర్గాల్లో చర్చ జరుగుతుంది. ఎల్అండ్టీకి ఇస్తామని అంగీకరించిన రూ.2వేల కోట్లను సమకూర్చడమే సర్కార్‌కు గగనంగా మారిన తరుణంలో ఆ సంస్థపై ఉన్న రూ.13వేల కోట్ల రుణాన్ని ప్రభుత్వం బదలాయించుకునేందుకు వేస్తున్న అడుగులకు అనేక సాంకేతిక అవరోధాలు ఎదురవుతున్నాయి.
మరోవైపు రేపోమాపో ప్రభుత్వం స్వాధీనం చేసుకునే మెట్రోకు మనమెందుకు సోకులు అద్దాలని ఎల్అండ్టీ చూస్తుంటే… అసలు స్వాధీన ప్రక్రియలోనే కిందామీద పడుతున్న ప్రభుత్వం నిర్వహణ ఊసు ఎత్తే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో రోజురోజుకూ మెట్రో ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నా సరైన సౌకర్యాలు మెరుగుపడక జనం నానా ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే దిక్కులేదు. హైదరాబాద్ మహా నగరంలో గత రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇటుక పేర్చింది లేదుగానీ వ్యవస్థల్ని ఒక్కొక్కటిగా కునారిల్లేలా చేస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒక్కటంటే ఒక్క నిర్మాణాన్ని పూర్తి చేయకపోయినా వేలాదిగా సామాన్యుల ఇండ్లను కూల్చివేసింది. అదేరీతిన ఒక్క మౌలిక సదుపాయాన్ని పెంచకపోయినా ఉన్న వాటిని అయోమయంలోకి నెడుతున్నది. ఇందులో భాగంగా హైదరాబాద్ మెట్రో వ్యవస్థలో మొదటి దశను విజయవంతంగా పూర్తి చేసి పట్టాలెక్కించిన కేసీఆర్ ప్రభుత్వం ఎయిర్‌పోర్టు మెట్రో ప్రాజెక్టుకు నిధుల సమీకరణ ప్రణాళికను పకడ్బందీగా రూపొందించడంతో పాటు సర్వే పూర్తి చేసి పనుల దశకు తీసుకువచ్చింది.
మొదటి దశతో లింకు లేకుండానే ఈ ప్రాజెక్టు సాఫీగా ముందుకుపోయేలా చర్యలు తీసుకుంది. కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మాత్రం కేసీఆర్ ఆనవాళ్లను చెరిపివేస్తానన్న సంకల్పంతో వెంటనే ఎయిర్‌పోర్టు మెట్రోను రద్దు చేశారు. రానున్న వంద సంవత్సరాల అవసరాలకు అనుగుణంగా మెట్రోను విస్తరిస్తామంటూ ఎడాపెడా ప్రణాళికలు రూపొందించి, కేంద్రానికి పంపింది. కానీ మొదటి దశతో వీటిని ఎలా అనుసంధానించాలనే కనీసం అవగాహన, ఆలోచన లేకుండానే డీపీఆర్‌ను కేంద్రానికి పంపడంతో ఆ మేరకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. అసలు మొదటి దశ మెట్రోను పొడిగిస్తూ విస్తరణ ప్రణాళికలు ఉన్నందున ఇప్పటికే మొదటి దశలోని 72 కిలోమీటర్లను నిర్వహిస్తున్న ఎల్అండ్టీతో ఒప్పందం చేసుకోవాలని కేంద్రం సూచించింది. కానీ ఎల్అండ్టీ వెంటనే ఉన్న మెట్రో మొదటి దశను వదులుకుంటానే తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంతో విస్తరణ ప్రాజెక్టు ఒప్పందం చేసుకునేదే లేదని ఏకంగా కేంద్రానికే లేఖ రాసింది. దీంతో డామిట్ కథ అడ్డం తిరిగి రేవంత్ సర్కార్ విస్తరణ ప్రాజెక్టు ఇంచు కూడా ముందుకు కదలని పరిస్థితి ఏర్పడింది.
అసలే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎల్అండ్టీతో అంతర్గతంగా రేవంత్ సర్కార్‌కు ఉన్న విభేధాలతో పాటు మెట్రో ఒప్పందం చేసుకోనని కేంద్రానికి లేఖ రాయడంతో పాలకులకు కోపం వచ్చింది. వెంటనే మొదటి దశ మెట్రోను తామే తీసుకుంటామంటూ ముందూ వెనుకా ఆలోచించకుండా ప్రక్రియను ముగించారు. ఈ హడావిడిలో ఎల్అండ్టీకి భారంగా ఉన్న రూ.13వేల కోట్ల రుణాన్ని తమ భుజాన వేసుకోవడంతో పాటు అదనంగా రూ.2వేల కోట్లను ఈక్విటీ కింద నగదు ఇచ్చేందుకు అంగీకరించింది. అసలు మెట్రో భారం నుంచి ఎలా తప్పించుకోవాలని ఎదురు చూస్తున్న ఎల్అండ్టీకి ఇదో బంపర్ ఆఫర్‌గా పరిణమించింది. ఎందుకంటే ఎల్అండ్టీ సంస్థ 2010లో జరిగిన ఒప్పందం ప్రకారం 2035 వరకు ఇదేరీతిన మెట్రోను నడిపి.. చివరకు 210 ఎకరాల భూమితో పాటు మెట్రోను ఉన్నది ఉన్నట్లుగా ప్రభుత్వానికి స్వాధీనం చేయాల్సి ఉంది. అంటే అప్పటివరకు మెట్రో నిర్వహణ భారంతో పాటు నిర్మాణానికి తీసుకున్న రూ.13వేల కోట్ల రుణాన్ని తీర్చేందుకు ఏటా రూ.960 కోట్ల భారాన్ని మోయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు రేవంత్ సర్కారు ఇచ్చిన ఆఫర్‌తో రూ.2వేల కోట్ల నగదు తీసుకొని రుణ, మెట్రో నిర్వహణ భారాన్ని ప్రభుత్వంపై మోపి తప్పుకొంటున్నది. వాస్తవాల తీరు ఇట్ల ఉంటే… పాలకులు మాత్రం తామేదో తక్కువకు మెట్రోను స్వాధీనం చేసుకున్నామంటూ గొప్పలు చెప్పుకోవడం అందరినీ విస్మయానికి గురి చేస్తున్నది.
మెట్రో విస్తరణకు కేంద్రం అనుమతి ఇవ్వాలంటే మొదటి దశ మెట్రోను ఎల్అండ్టీ నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. ఇందుకు ఆ సంస్థకు ఇస్తామన్న రూ.2వేల కోట్లతో పాటు సంస్థపై ఉన్న రూ.13వేల కోట్ల రుణ భారం… మొత్తం రూ.15వేల కోట్లు కావాలి. ఈ మేరకు కొన్నిరోజుల కిందట అధికారులు ఏడీబీ (ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్)ను సంప్రదించగా తాము ఇచ్చే రుణం ఎఫ్ఆర్బీఎం పరిధిలోకి వస్తుందనే షరతు విధించినట్లు తెలిసింది. కానీ ఈ ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ఆర్బీఎం లెక్కల్ని పరిశీలిస్తే… బడ్జెట్లో రూ.54,009 కోట్లుగా చూపిన ప్రభుత్వం సవరించి రూ.71వేల కోట్లకు పెంచింది. ఇప్పటికే ఉన్న వివిధ రుణాల రీషెడ్యూల్‌తో మరింత వెసులుబాటు వచ్చి ప్రస్తుతం ఎఫ్ఆర్బీఎం పరిధి రూ.78,900 కోట్లకు వచ్చింది. కానీ ఇప్పటికే ప్రభుత్వం రూ.68,300 కోట్ల రుణాల్ని తీసుకోవడంతో పాటు మిగిలిన రూ.10,600 కోట్ల రుణ సేకరణకు మార్చి వరకు ప్రణాళిక కూడా రూపొందించింది. దీంతో మెట్రో రుణానికి కించిత్తు అవకాశం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో అధికారులు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్(ఐఆర్ఎఫ్సీ) గడపను తొక్కారు. ఈ ఆర్థిక సంస్థ గతంలో సూరత్ మెట్రో సంస్థ, మహారాష్ట్ర విద్యుత్ సంస్థలకు ఆర్థిక వనరులను సమకూర్చింది. అయితే హైదరాబాద్ మెట్రో మొదటి దశను కూలంకశంగా పరిశీలించిన ఐఆర్ఎఫ్సీ ఇప్పటికే రూ.6వేల కోట్ల నష్టాన్ని చవిచూసినట్లు గుర్తించింది. ఇక మెట్రో ఆదాయం కూడా ఏటా తగ్గుదలతో గత ఆర్థిక సంవత్సరంలో 21 శాతం తగ్గింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని నష్టాల్లో మెట్రోకు వయబులిటీ (మనుగడ) లేదని నిర్ధారించుకొని రుణాన్ని ఇచ్చేందుకు అంగీకరించలేదని విశ్వసనీయంగా తెలిసింది.
మొదటి దశ మెట్రోను స్వాధీనం చేసుకోవడానికి రూ.15వేల కోట్లు సమకూరిస్తేనే విస్తరణ ప్రాజెక్టుకు కేంద్రం అంగీకరించనుంది. ఈ గండం గట్టెక్కినా… మెట్రోకు ముందు మరిన్ని సవాళ్లు ఉన్నాయని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒకవైపు నష్టాల్లో ఉన్న మొదటి మెట్రోను నిర్వహించడంతో పాటు సౌకర్యాలు మెరుగుపరచాల్సి ఉంది. దీంతో పాటు రూ.44వేల కోట్లతో చేపట్టనున్న విస్తరణ ప్రాజెక్టులో కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సాయం గరిష్ఠంగా 18 శాతం మాత్రమే. అంటే కేంద్రం పూర్తిగా సహకరించేందుకు ముందుకొస్తే వచ్చే మొత్తం రూ.8వేల కోట్ల పైచిలుకు. మిగిలిన దానిలో రూ.7,313 కోట్లు రేవంత్ సర్కార్ ప్రభుత్వపరంగా సమకూర్చుకోవాలి. మిగిలిన 48 శాతాన్ని అంటే రూ.26వేల కోట్ల కోసం తిరిగి రుణాలు సేకరించాలి. దీంతో మొదటి దశ స్వాధీనానికి రూ.15వేల కోట్లతో పాటు విస్తరణకు రూ.26వేల కోట్లు… రూ.41వేల కోట్లు కేవలం మెట్రో ప్రాజెక్టుపైనే రుణంగా మిగులనున్నది.