ఖైరతాబాద్, మార్చి 20: ‘ఖమ్మం జిల్లా వెలుగుమట్ల వినోభానగర్‌లో 32.7 ఎకరాలను దాచి, దోచి పెట్టేందుకు కొందరు అధికార, ప్రజాప్రతినిధులు కుట్రలు పన్నారు. మొత్తం 62.7 ఎకరాల భూధాన్ భూములుంటే 32 ఎకరాలే భూదాన్ భూమి అంటూ దొంగలెక్కలు చెప్తున్నారు’ అని వక్తలు ఆరోపించారు. ‘వెలుగుమట్ల భూబాధితుల సమస్యలపై సత్యాలు, అసత్యాలు, అర్ధసత్యాలు’ అన్న అంశంపై శుక్రవారం హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పలువురు మాట్లాడారు. వెలుగుమట్లలో పేదల ఇండ్ల కూల్చివేతల్లో మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ప్రత్యక్షంగా ఉన్నారని, ఆయన చెప్పినట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి చేశారని, అన్నీ తెలిసిన మరో మంత్రి భట్టి విక్రమార్క నోరు విప్పకుండా మౌనంగా ఉన్నారని సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి ఘాటుగా ఆరోపించారు.
రాష్ట్ర పాలనా వ్యవహారాలన్నీ ఏపీ సీఎం చంద్రబాబు కనుసన్నల్లో సాగుతున్నాయని, శిష్యులైన రేవంత్, తుమ్మల అదే పాటిస్తున్నారని ధ్వజమెత్తారు. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ.. ఎల్లో కాంగ్రెస్‌గా మారిపోయిందని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు చిత్తశుద్ధితో వెలుగుమట్ల బాధితుల పక్షాన ఐక్యంగా సంఘీభావ పోరాటాలు చేయాలని కోరారు. జర్నలిస్టు రఘు మాట్లాడుతూ వినోభానగర్‌లో 62. 7 గుంటల భూదాన్ భూమి ఉంటే 32 ఎకరాల భూమి ఉన్నదంటూ కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు సైతం అంటున్నారని, మిగతా భూమి విషయాన్ని ఎందుకు దాచి పెడుతున్నారని, ఆ 30.7 ఎకరాలను ఎవరి చేతిలో పెట్టడానికి దాచిపెడుతున్నారని ప్రశ్నించారు. ఇప్పటికే ఆ 30.7 ఎకరాలకు పట్టాలు వచ్చాయని, పాస్ పుస్తకాలు కూడా ఉన్నాయని, సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి ఫొటోలతో భూభారతిలో అది భూదాన్ భూమి అని ఉన్నదని చెప్పారు. భూదాన్ యజ్ఞ బోర్డు చైర్మన్ కూడా ఈ విషయాలను బయటపెట్టాలని పిలుపునిచ్చారు.
వెలుగుమట్లలో నిరుపేదలను నిర్వాసితులను చేసిన కనికరం లేని పాలకులకు పాపం తగులక మానదని తెలంగాణ క్రాంతిదళ్ అధ్యక్షుడు పృథ్వీరాజ్ హెచ్చరించారు. వారంతా అప్పులు చేసి, పుస్తెలమ్మి ఇండ్లు కట్టుకున్నారని తెలిపారు. చిన్న పిల్లలని కూడా చూడకుండా బలవంతంగా వెళ్లగొట్టారని, చిన్నారులను పెట్టుకొని దోమలతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అనేక ఏండ్లుగా పేదలు అదే భూమిలో నివాసం ఉంటున్నారని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దని కోర్టు ఆదేశాలు ఉన్నా.. అకస్మాతుగా వారి ఇండ్లను కూలగొట్టి వారిని నిర్దాక్షిణ్యంగా వెళ్లగొట్టడం అమానుషమని తెలంగాణ సమాఖ్య కన్వీనర్ కరుణాకర్ దేశాయ్ విమర్శించారు. నిర్వాసితుల హక్కులను పట్టించుకోని ప్రభుత్వం చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడుతుందని ధ్వజమెత్తారు.
కూల్చిన ఇండ్ల స్థానంలోనే నిర్వాసితులందరికీ కొత్త ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, బాధిత కుటుంబాలకు ప్రత్యామ్నాయ నివాస వసతి కల్పించాలని, కూల్చివేతలతో జరిగిన ఆస్తినష్టానికి పరిహారం చెల్లించాలని, చదువులు కోల్పోయి, పరీక్షలు రాయలేకపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని, కూల్చివేతకు ప్రధాన కారకులైన మంత్రులు, పోలీస్ అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని, భూ నిర్వాసితులపై అసత్య ప్రచారాలను మానుకోవాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బాధితులకు సంఘీభావంగా ప్రజలు, ప్రజాసంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు చేపడుతామని హెచ్చరించారు. సమావేశంలో భారత్-చైనా మిత్రమండలి జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎం మోహన్‌రెడ్డి, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ జతిన్‌కుమార్, కార్యదర్శి విజయేందర్ రావు, గాయని మధుప్రియ తదితరులు పాల్గొన్నారు.