Siricilla | సిరిసిల్ల రూరల్, ఆగస్టు 13 : రాజన్న సిరిసిల్ల జిల్లాలో యూరియా కోసం రైతులు హరిగోస పడుతున్నారు. యూరియా బస్తాల కోసం రైతులు సింగల్ విండో గోదాములు, ఫర్టిలైజర్ దుకాణాల్లో పడిగాపులు కాస్తున్నారు. తంగళ్ళపల్లి మండలం జిల్లెల్లలోని నేరెళ్ల సింగిల్ విండో గోదాం వద్ద యూరియా లోడ్ మంగళవారం చేరుకోగా, బుధవారం పంపిణీకి రైతులకు సిబ్బంది సమాచారం అందించారు. మంగళవారం రాత్రి నుంచి రైతులు పడిగాపులు కాయడం గమనార్హం. రాత్రి వేళలో ఆధార్ కార్డు జిరాక్స్‌లు, పట్టాదారు పాస్‌బుక్ జిరాక్స్ లైన్లో పెట్టి నెంబర్లు వేయించుకున్నారు.
బుధవారం ఉదయం గోదాం వద్దకు భారీగా రైతులు చేరుకున్నారు. సిబ్బందితో యూరియా సరిపోవడం లేదని వాగ్వాదానికి దిగారు. 330 బస్తాలు రాగ, ఇంకా యూరియా బస్తాలు కావాలని రైతులు ఆందోళన చేశారు. పోలీసు పహారాలో యూరియాను పంపిణీ చేయడం గమనార్హం. ఇదేవిధంగా తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్‌లో ఫర్టిలైజర్ షాప్ వద్దకు రైతులు భారీగా చేరుకున్నారు. ఎరువుల బస్తా కోసం పడిగాపులు కాస్తున్నారు. దీంతోపాటు సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని పెద్దూరులో సింగిల్ విండో కార్యాలయానికి యూరియా కోసం రైతులు భారీగా చేరుకున్నారు. ప్రభుత్వం ,అధికారులు యూరియా కొరత లేదని చెప్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతులకు యూరియా సకాలంలో అందించడంలో ప్రభుత్వం విఫలమైందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.