Fourth City | ఓవైపు తమ భూములు ఇవ్వబోమంటూ రైతులు ఆర్తనాదాలు పెడుతుంటే.. ప్రభుత్వం మాత్రం నిర్దయగా వ్యవహరిస్తున్నది. లగచర్ల పరిధిలో ఫార్మా కంపెనీల కోసం భూసేకరణ ప్రక్రియపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చినా ప్రభుత్వానికి గుణపాఠం రావడం లేదు. ఫోర్త్ సిటీ రోడ్డు కోసం కందుకూరు మండలంలో పెద్ద ఎత్తున భూసేకరణకు ప్రభుత్వం తెరలేపింది. భూమిని నమ్ముకున్న బతుకులు తమవని.. ఆ భూమినే లాక్కుంటే బతకడమే భారంగా మారుతుందంటున్న రైతులపై కాంగ్రెస్ సర్కార్ కక్షగట్టింది. పోలీసు బలగాలతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి.. అనేక నిర్బంధాల మధ్య సర్వే ప్రక్రియను పూర్తిచేసింది. తమను సంప్రదించకుండా, భూమి ఎంత పోతుందో? ఎంత ధర చెల్లిస్తుందో చెప్పకుండా ప్రభుత్వం ఏకపక్షంగా సర్వే చేయడమేమిటని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రంగారెడ్డి, నవంబర్ 27 (నవంబర్): రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేట్ వద్ద ఏర్పాటు చేయతలపెట్టిన ఫోర్త్‌సిటీ రోడ్డుకోసం ప్రభుత్వం అనేక నిర్బంధాలను ప్రయోగిస్తూ భూముల సర్వే నిర్వహించింది. తమ భూముల నుంచి రోడ్డు వేయొద్దంటూ బాధిత గ్రామాల రైతులు సర్వేను అ డుగడుగునా అడ్డుకున్నారు. దీంతో ప్రభుత్వం పోలీసు పహారా మధ్య బలవంతంగా సర్వేను పూర్తిచేసింది. ఈ సర్వేలో అనేక సంఘటనలు చోటుచేసుకున్నాయి. తొలుత కొంగరకలాన్ వద్ద జరిగిన సర్వేను ఆ గ్రామ రైతులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి రైతులను బలవంతంగా పక్కకు తప్పించి సర్వేను పూర్తిచేశారు.
తమ భూముల్లో సర్వే చేయొద్దంటూ ఓ రైతు పెట్రోల్ డబ్బాతో ఆత్మహత్యకు యత్నించారు. అయినా ప్రభుత్వం పునరాలోచించకుండా సర్వేను ముందుకు నడిపించింది. కొంగరకలాన్, కొంగరఖుర్దు, ఫిరోజ్‌గూడ, లేమూర్, తిమ్మాపూర్, రాచులూరు, గుమ్మడవెల్లి, పంజాగూడ, మీర్ఖాన్పేట్ గ్రామాల్లో కూడా రైతులు సర్వేను అడ్డుకున్నారు. అయినా పోలీసు బలగాలతో రైతులను అణచివేసి సర్వే నిర్వహించారు. ఆయా ప్రాంతాలకు ఇతర ప్రాంతాల నుంచి రాజకీయ, ప్రజాసంఘాల నేతలు రాకుండా రాచులూరు సమీపంలోని తుర్కగూడ వద్ద ఏకంగా పోలీసు పికెట్నే ఏర్పాటుచేశారు.
450 ఎకరాలు.. 2,000 మంది రైతులు
ఫోర్త్‌సిటీ వరకు సుమారు 9 గ్రామాల నుం చి ఈ రోడ్డు వేయనున్నారు. ఈ రోడ్డుకోసం సుమారు 2వేల మంది రైతులు తమ భూములను కోల్పోనున్నారు. ఔటర్‌రింగ్‌రోడ్డు ఎగ్జిట్ నంబర్ 13 నుంచి మీర్ఖాన్పేట్ వరకు రోడ్డు వేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ఈ ప్లాన్ ప్రకారం పంజాగూడలో 1.3 ఎకరాలు, కొంగరకలాన్‌లో 55 ఎకరాలు, కొంగరఖుర్దులో 55 ఎకరాలు, లేమూర్‌లో 84 ఎకరాలు, తిమ్మాపూర్‌లో 47 ఎకరాలు, గుమ్మడవెల్లిలో రిజర్వు ఫారెస్టు నుంచి 32 ఎకరాలు, పంజాగూడలో తెలంగాణ టీజీఐఐసీ నుంచి 18 ఎకరాలు, మీర్ఖాన్పేట్లో 62 ఎకరాలు ఈ రోడ్డు నిర్మాణంలో తీసుకునే ప్లాన్‌లో సర్వే నిర్వహించారు.
మరో రెండురోజుల్లో రైతులకు నోటీసులు
సర్వే ఆధారంగా ఆయా గ్రామాల్లో సేకరిం చే భూముల వివరాలను అధికారులు గుర్తించారు. మరో రెండురోజుల్లో భూములు కో ల్పోతున్న రైతులకు అధికారికంగా నోటీసులు జారీచేయడానికి అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. నోటీసుల జారీతర్వాత రిజిస్ట్రేషన్ వ్యాల్యూ ప్రకారం పరిహారాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేయనున్నారు. దీంతో భూ ములు కోల్పోతున్న రైతుల్లో గుబులు పుట్టుకున్నది. బాధిత గ్రామాల్లో బహిరంగ మార్కెట్లో ఎకరాకు 2 నుంచి 3 కోట్ల వరకు ధరలు ఉన్నాయి. ప్రభుత్వం ఈ మేరకు ధరలు చెల్లిస్తుందా? లేదా? అనేది రైతులల్లో ఆందోళన నెలకొన్నది. ఉన్న భూములు కూడా రోడ్డుకోసం పోతే తమ పరిస్థితి ఏమిటని అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు.