Accident | ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. కామారెడ్డి జిల్లాలో సైకిల్‌ను వేగంగా వచ్చిన ఓ బైక్ ఢీకొనడంతో ఇద్దరు.. నిజామాబాద్ జిల్లాలో బైక్‌ను కారు ఢీకొట్టడంతో మరో ఇద్దరు మరణించారు. ఈ రెండు ప్రమాదాలకు అతివేగమే కారణమని తెలుస్తోంది.
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి వద్ద హైవేపే సైకిల్ తొక్కుకుంటూ వెళ్తున్న వెంకట్(43)ను వేగంగా వచ్చి ఓ బైక్ ఢీకొట్టింది. ఈ ఘటనలో సైకిల్‌పై వెళ్తున్న వెంకట్‌తో పాటు బైక్ నడుపుతున్న నిఖిల్ రెడ్డి (25) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. బైక్‌పై వెనుక కూర్చున్న సుమంత్‌కు తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు.
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అశోక్‌సాగర్ వద్ద బైక్‌ను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అనాస్, సమీర్ మృతిచెందగా, కరీం అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మరోవైపు సిద్దిపేట జిల్లా చేగుంట శివారులో హైవేపై రోడ్డు దాటుతున్న ఇద్దరు వ్యక్తులను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను సమీప పరిశ్రమలో పనిచేసే వలస కార్మికులుగా గుర్తించారు. ఇక పెద్దపల్లి జిల్లా మంథని మండలం బిట్టుపల్లి సమీపంలో శుక్రవారం ఉదయం ఆటో బోల్తాపడటంతో 10 మంది ప్రయాణికులు గాయపడ్డారు.