హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్ట్ 13 (నమస్తే తెలంగాణ): విద్యుదాఘాతంతో 24 గంటల్లోనే మరో నలుగురు మృత్యువాత పడ్డారు. హైదరాబాద్ నగరంలో వేర్వేరు చోట్ల ముగ్గురు చనిపోగా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక యువకుడు మృతిచెందాడు. హైదరాబాద్ నగరంలోని పాతబస్తీ బండ్లగూడలో సోమవారం అర్ధరాత్రి విషాదం చోటుచేసుకున్నది. వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఇద్దరు యువకులు మృతిచెందారు. జల్పల్లిలో వినాయక విగ్రహాన్ని కొనుగోలు చేసి చాంద్రాయణగుట్ట నుంచి నలుగురు యువకులు బండ్లగూడకు వెళ్తున్నారు. రాత్రి 12 గంటల సమయంలో వారు వెళ్తున్న ట్రాక్టర్‌కు విద్యుత్తు తీగలు తగిలిన ప్రమాదంలో టోనీ కిందపడిపోగా అతని పైనుంచి ట్రాక్టర్ టైర్లు వెళ్లాయి. క్షతగాత్రులను చికిత్స కోసం దవాఖానకు తరలించగా, అక్కడే చికిత్స పొందుతూ వికాస్ (21), టోనీ (20) మృతిచెందారు. గాయాలపాలైన అఖిల్‌కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ట్రాక్టర్ రెండు టైర్లు సైతం కాలిపోయాయి.
వినాయక మండపం వేస్తుండగా..
అంబర్‌పేట, ఆగస్టు 19: వినాయక మండపం వేస్తుండగా విద్యుత్తు షాక్‌తో మరో యువకుడు మృతిచెందాడు. బాగ్‌అంబర్‌పేట శ్రీకామాక్షి భవన్ వద్ద సోమవారం రాత్రి వినాయక మండపం ఏర్పాటుకు పైకప్పు వేస్తుండగా, పొడవాటి కర్రను పైకి లేపడంతో అది హెటెన్షన్ విద్యుత్తు వైర్లకు తాకింది. దీంతో విద్యుత్‌షాక్‌కు గురైన రామ్‌చరణ్ తేజ (18)ను దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు.
పుట్టినరోజు నాడే కాటేసిన కరెంటు తీగలు
కామారెడ్డి/సిరిసిల్ల తెలంగాణ చౌక్, ఆగస్టు 19: వినాయక విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుత్‌షాక్‌తో మరో యువకుడు చనిపోయాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన యువకులు ఆర్మూర్‌లో విగ్రహాన్ని కొని ట్రాక్టర్లో విగ్రహాన్ని తీసుకొస్తుం డగా, ఆరేపల్లి స్టేజీ వద్ద 11 కేవీ విద్యుత్తు వైర్‌కు తగిలింది. ఈ ప్రమాదంలో గాయపడిన కొమ్ము లక్ష్మీనారాయణ (19)ను కామారెడ్డి ప్రభుత్వ దవాఖానకు తరలించగా, మృతి చెందినట్టు వైద్యులు పేర్కొన్నారు. పుట్టినరోజు నాడే లక్ష్మీనారాయణ మృతిచెందడంపై ఆ కుటుంబంలో విషాదం అలుముకున్నది.
మరో ఇద్దరు రైతుల ఆత్మహత్య
పాలకుర్తి/కాటారం, ఆగస్టు 19 : దిగుబడులు రాక.. అప్పుల భారం మోయలేక ఇద్దరు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలు జనగామ, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. జనగామ జిల్లా పాలకుర్తి మండలం సిరిసన్నగూడెం శివారు కంబాలకుంట తండాకు చెందిన బానోత్ భీక్యానాయక్ (54)కు రెండెకరాల వ్యవసాయ భూమి ఉన్నది. నిరుడు మిర్చి పండించగా, ఈ సారి పత్తి సాగుచేస్తున్నాడు. మిర్చి దిగుబడి సరిగా రాకపోవడంతో రూ.4.50 లక్షల వరకు అప్పులయ్యాయి. అప్పులు తీర్చే మార్గం లేకపోవడంతో ఈ నెల 13న బావి వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా, వరంగల్ ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.
అంకుసాపూర్‌లో రైతు బాపు..
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం అంకుసాపూర్‌కు చెందిన రైతు బొల్లి బాపు (38) ఎకరం భూమిలో వ్యవసాయం, కూలీపనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ ఏడాది ఎకరం పొలంలో పత్తి సాగుచేయగా వర్షాలతో గడ్డి విపరీతంగా మొలిచి పంట ఎర్రబారి నష్టం వాటిల్లింది. దీనికితోడు పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పు రూ.70 వేలు ఉండగా, ఇటీవల రూ.1.20 లక్షలు పెట్టి ఎడ్లను కొనుగోలు చేశాడు. ఇందులో రూ.40 వేలు చెల్లించి మిగతా రూ.80 వేలు కొద్ది రోజులకు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. ఎడ్లు అమ్మిన వ్యక్తి డబ్బు కావాలని ఒత్తిడి చేయగా పదిరోజుల్లో ఇస్తానని చెప్పాడు. మొత్తంగా అప్పులతో మనస్తాపం చెందాడు. సోమవారం సాయంత్రం ఇంట్లో దూలానికి చీరతో ఉరివేసుకున్నాడు. భర్తను చూసి కేకలు వేయగా, స్థానికులు భూపాలపల్లిలోని ప్రభుత్వ దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.