నారాయణపేట రూరల్, ఏప్రిల్ 18: మేకలు కాసేందుకు వెళ్లిన మహిళతోపాటు ఆమె వెంట ఉన్న ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. ఈ సంఘటన మంగళవారం నారాయణపేట జిల్లా బోయిన్పల్లి గ్రామంలో చోటుచేసుకున్నది. వివరాల్లోకి వెళ్తే.. బోయిన్‌పల్లికి చెంది న రాములు భార్య సురేఖ(28) తమ మేకలను కా సేందుకు గ్రామ శివారులోకి వెళ్లింది. ఆమె వెంట కుమారుడు విజయ్(8), సురేఖ అక్క కూతుర్లు లఖి త(7), మమతతోపాటు పక్కింటి నర్సప్ప కుమారు డు వెంకటేశ్(8) కూడా వెళ్లాడు. గ్రామ సమీపంలో ఉన్న చెరువు పరిసరాల్లో సురేఖ మేకలను మేపుతుండగా.. చిన్నారులు విజయ్, లఖిత, వెంకటేశ్ సరదాగా ఆడుకునేందుకు చెరువులోకి దిగారు.
కేరింతలు కొడుతూ ఆడుకుంటూ చెరువు లోతుల్లోకి వెళ్లి మునిగిపోయారు. చిన్నారులు కేకలు వేయడంతో సురేఖ అక్కడికి చేరుకొని వారిని కాపాడేందుకు యత్నించింది. ఈ క్రమంలో సురేఖ కూడా చిన్నారులతోపాటే నీటిలో మునిగింది. చెరువు ఒడ్డున ఉన్న మమత చూసి పరుగెత్తుకుంటూ వెళ్లి గ్రామస్థులకు విషయం చెప్పింది. గ్రామస్థులు చెరువు వద్దకు వచ్చి వారిని బయటకు తీయగా.. నలుగురూ అప్పటికే మృతి చెందారు. ముగ్గురు చిన్నారులు గ్రామంలోని పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై సురేశ్ తెలిపారు.