Road Accident | భైంసా, జనవరి 20: నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని సాత్ ఫూల్ వంతెనపై సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిర్మల్ నుంచి నాందేడ్ మార్గం వైపు వెళ్తున్న కంటైనర్ లారీ, నిజామాబాద్ వైపు నుంచి భైంసా పట్టణంలోకి వస్తున్న ఎర్టిగా వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఎర్టిగా వాహనంలో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
కుభీర్ మండలంలోని కుప్టి సర్పంచ్ గంగాధర్‌తో పాటు మరో ఐదుగురు గ్రామస్తులు హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గ్రామస్తుడిని పరామర్శించేందుకు సోమవారం ఉదయం బయలుదేరి వెళ్లారు. వీరందరూ రాత్రి పూట అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. మరికొద్ది నిమిషాల్లో భైంసాకు చేరుకునే సమయంలో వారి కారు ప్రమాదానికి గురైంది. ఎదురుగా వచ్చిన కంటైనర్ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కుభీర్ మండల కేంద్రానికి చెందిన ఎర్టిగా వాహన డ్రైవర్ బొప్ప వికాస్(24) తో పాటు అందులో ప్రయాణిస్తున్న భోజరామ్ పటేల్(42), కొడిమెల పెద్ద రాజన్న (62), బోయిడి బాబన్న (65)లు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఇక మధ్య సీట్లో కూర్చున్న గ్రామ సర్పంచు గంగాధర్ తీవ్రంగా గాయపడ్డాడు. సిందే ఆనంద్ రావ్, గుండోల్ల లక్ష్మణ్(చిన్ను) స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిన సర్పంచ్ గంగాధర్‌ను భైంసాలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న భైంసా ఏఎస్పీ రాజేశ్ మీనా, సీఐ సాయికుమార్లు ఘటనాస్థలికి చేరుకుని వాహనంలో చిక్కుకున్న మృతదేహాలను స్థానికుల సహాయంతో బయటకు తీయించారు. అయితే తీవ్రమైన ప్రమాదం కారణంగా బోయిడి బాబన్న శరీరం నుంచి తల తెగిపోవడం ప్రమాద తీవ్రతను సూచిస్తోంది. మృతదేహాలను ట్రాలీ ఆటోలో పోస్టు మార్గం నిమిత్తం భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు.