నల్లగొండ: చేవెళ్లలో ఘోర బస్సు ప్రమాద ఘటన మరవక ముందే మరో యాక్సిడెంట్ (Road Accident) జరిగింది. నల్లగొండ (Nalgonda) జిల్లా వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం వద్ద అద్దంకి-నార్కట్‌పల్లి హైవేపై వేగంగా వచ్చిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు (Travels Bus) అదుపుతప్పి ముందువెళ్తున్న ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీ కొట్టింది. దీంతో ట్రాక్టర్ (Tractor) రోడ్డుపై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్లో ప్రయాణిస్తున్న నలుగురు కూలీలు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మిర్యాలగూడ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
ట్రావెల్స్ బస్సు ఆంధ్రప్రదేశ్‌లోని కావలి నుంచి హైదరాబాద్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలిపారు. తెల్లవారుజామున 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందన్నారు. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పారు. ఎవరికీ ప్రాణాపాయం లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
చేవెళ్లలో..
తెల్లవారక ముందే బస్సెక్కిన 19 మంది ప్ర యాణికుల బతుకులు తెల్లారేలోగా కానరానిలోకాలకు మరలిపోయాయి. గమ్యస్థానాలకు చేరుకోక ముందే తమ వారికి దూరమయ్యా రు. క్షేమంగా వెళ్లొచ్చని ఆర్టీసీ బస్సు ఎక్కిన వారికి కంకర టిప్పర్ రూపంలో మృత్యుశకటం ఎదురొచ్చి ప్రాణాలనే బలి తీసుకున్నది. నిద్రలో ఉన్నవారు కొందరు శాశ్వత నిద్రలోకి జారిపోయారు. కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో ట్రావెల్స్ బస్సు అగ్నిప్రమాదానికి గురై 19 మంది సజీవదహనమైన ఘటనను మరువకముందే రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలోని మీర్జాగూడ గేట్ వద్ద సోమవారం తెల్లవారుజామున మరో ఘోర రోడ్డు ప్రమా దం జరిగింది.
ఈ దుర్ఘటనలో టిప్పర్, బస్సు డ్రైవర్లు ఇద్దరు సహా 19 మంది దుర్మరణం పాలయ్యారు. తాండూరు నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సును అతివేగంగా వచ్చిన కంకర టిప్పర్ బలంగా ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకున్నది. వికారాబాద్ జిల్లా తాండూరు డిపో ఆర్టీసీ బస్సు (టీఎస్ 34టీఏ6354) తాండూరు నుంచి తెల్లవారుజామున 4:30 గంటలకు 30 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు బయలుదేరింది. మార్గంమధ్యలో వికారాబాద్ తదితర బస్టాప్‌లలో ఎక్కిన వారితో కలిపి మొత్తం 72 మంది ప్రయాణికులతో వెళ్తున్నది. చేవెళ్ల మండల పరిధిలోని మీర్జాగూడ గేట్ సమీపంలోని హైదరాబాద్-బీజాపూర్ హైవేపై చేవెళ్ల నుంచి వికారాబాద్‌కు కంకర లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ (టీజీ 06టీ3879) వాహనం ఎదురుగా అతి వేగంగా వచ్చి ఆర్టీసీ బస్సును ఢీకొట్టి, దానిపై పూర్తిగా ఒరిగిపోయింది.
దానిలో ఉన్న కంకరమొత్తం బస్సులోకి జా రింది. దీంతో ఆర్టీసీ బస్సు కుడివైపున 8 వరుసల సీట్లు పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. ఆ సీట్లలో కూర్చున్న కొందరు ప్రయాణికులు బలమైన గాయాలతో మరణించగా, మరికొందరు కంకరలో కూరుకుపోయి ఊపిరాడక వి లవిల్లాడుతూ చనిపోయారు.