Farmers Suicides | దుబ్బాక/తానూర్/జైపూర్/భైంసాటౌన్, మే 6: దిగుబడులు రాక.. చేసిన అప్పులు తీర్చేమార్గం లేక తీవ్ర మనస్తాపంతో నలుగురు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు సిద్దిపేట, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. వివరాలు ఇలా.. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని దుంపలపల్లికి చెందిన అండెం రవీందర్‌రెడ్డి (36) తనకున్న రెండెకరాల్లో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. సాగునీటి కోసం పొలంలో మూడు బోరు బావులు తవ్వించినా చుక్కనీరు పడలేదు. బోర్లు వేసినందుకు చేసిన అప్పులు పెరిగిపోయాయి.
ఈ అప్పులు ఎలా తీర్చాలో తెలియక మానసికంగా కుంగిపోయాడు. మంగళవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం పౌనూర్ గ్రామానికి చెందిన కౌలు రైతు బౌతు శంకర్(45) ఐదెకరాలు కౌలు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. సాగుకు రూ.6 లక్షల అప్పు తీసుకువచ్చాడు. ఇటీవల గాలివానకు పంట మొత్తం నేలవాలింది. దిగుబడి రాదేమోనని, అప్పులు తీర్చలేనేమోనన్న బెంగతో సోమవారం ఇంట్లో గడ్డి మందు తాగాడు. కుటుంబ సభ్యులు మంచిర్యాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించగా, మంగళవారం మృతి చెందాడు.
నిర్మల్ జిల్లా తానూర్ మండలం ఝరి(బి) గ్రామానికి చెందిన బొడ్డొల్ల పోతన్న(53) తనకున్న రెండు ఎకరాల భూమిలో వ్యవసాయం చేస్తున్నాడు. సాగుకు రూ.3 లక్షల వరకు అప్పులు కాగా, వాటిని చెల్లించే స్థోమత లేక మనస్తాపానికి గురై మద్యానికి అలవాటుపడ్డాడు. మంగళవారం ఉదయం మండల శివారు చేనులో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నిర్మల్ జిల్లా భైంసా మండలం గుండెగాంకు చెందిన సూర్యవంశీప్రసాద్(48) పంచాయతీ కార్యాలయంలో కారోబార్‌గా పనిచేస్తున్నాడు. గుండెగాంకు ఆనుకొని నిర్మించిన రంగారావు పల్సికర్ బ్యాక్‌వాటర్ ఏరియాలో ప్రసాద్ తనకున్న నాలుగెకరాల్లో సోయా సాగుచేశాడు.
వర్షాకాలంలో బ్యాక్‌వాటర్ పెరగడంతో సోయాపంట పూర్తిగా మునిగిపోయింది. ఈ యాసంగిలో సాగుచేసిన జొన్న పంటను కోతకోసి ఆరబెట్టగా గాలి దుమారంతో కూడిన వర్షానికి కంకులన్నీ తడిచిపోయాయి. ప్రాజెక్ట్ బ్యాక్‌వాటర్‌తో ఇల్లు కూడా కూలిపోయింది. దీంతో భైంసాలో అద్దెకు ఉంటున్నాడు. ప్రభుత్వం ఇస్తున్న జీతం రావడం లేదు. అద్దె కట్టడానికి డబ్బులు లేని దుస్థితికి చేరాడు. సాగుకు చేసిన రూ.6 లక్షల అప్పు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపం చెందాడు. సోమవారం రాత్రి జొన్న పంటకు కాపలా ఉంటానని భార్యతో చెప్పి గ్రామ శివారులోని చేను వద్దకు వెళ్లి చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.