BJP | హైదరాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రమాదం జరిగి నాలుగురోజులు గడుస్తున్నా బీజేపీ మాత్రం కిక్కురుమనడం లేదు. ఘటన జరిగిన రోజు ఆ పార్టీ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ప్రకటనలిచ్చారు. ఆ తర్వాత గప్‌చుప్ అయ్యారు. ఘటన గురించి ఒకరు కూడా మాట్లాడకపోవడంపై రాజకీయ పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్నదని ఇతర ప్రతిపక్ష పార్టీలు విమర్శస్తున్నా బీజేపీ నేతలు కనీసం పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సొరంగంలో పనులు ప్రారంభించే ముందు సరైన రీతిలో పరీక్షలు జరగలేదని, భద్రత ఏర్పాట్లలోను లోపాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్న సంగతి తెలిసిందే. అయినా బీజేపీ అగ్రనాయకత్వం ఎందుకు మౌనంగా ఉన్నదోనని ఆ పార్టీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ వైఫల్యాలపై, హామీల అమలులో చేస్తున్న మోసాలపై ఎలాగూ పోరాటం చేయడం లేదని, కనీసం ఇలాంటి సందర్భాలలోనైనా ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపకుండా చేతులు కట్టుకోవడం ఏమిటని బీజేపీ సీనియర్ నేతల్లో చర్చ జరుగుతున్నది. జాతీయస్థాయిలో కాంగ్రెస్‌తో వైరం కొనసాగుతున్నా.. రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదన్న సంకేతాలు బలపడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అందివచ్చిన అవకాశాన్ని అందుకోకపోవడం వెనుక?
రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారుతున్నదని, అసెంబ్లీ ఎన్నికలకు ముందున్న జోష్ ఎకడా కనిపించడం లేదని పార్టీ కార్యకర్తలే విమర్శిస్తున్నారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ చేతులు కలిపిన భావన ప్రజల్లోకి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 14 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని తప్పులు చేసినా, ప్రజలను మభ్యపెడుతున్నా, రాష్ట్రస్థాయిలో ఏ ఒక ఉద్యమాన్ని కూడా బీజేపీ చేపట్టకపోవడమే దీనికి ఉదాహరణగా చెప్తున్నారు. కనీసం ఇలాంటి సమయంలోనైనా స్పందిస్తే పరిస్థితిలో కాస్త మార్పు కనిపించేదని అభిప్రాయపడుతున్నారు. వాస్తవానికి రాష్ట్రంలో ఇప్పుడు పట్టభద్రుల, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు నేరుగా తలబడుతున్నారు.
ఇలాంటి సమయంలో ఎస్ఎల్బీసీ ఘటనను బీజేపీ ఎత్తిచూపితే ఎన్నికల్లో కొంత లబ్ధి పొందే అవకాశం ఉండేదని, అందివచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకోకపోవడం వెనుక మతలబు ఏమిటని రాజకీయ పరిశీలకులు సందేహపడుతున్నారు. దీని వెనుక ఏదో బలమైన కారణం ఉన్నదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారంలో లేకపోయినా ఇప్పటికీ బీఆర్ఎస్ను విమర్శించడానికి బీజేపీ నేతలు ఉత్సాహం చూపిస్తున్నారని గుర్తుచేస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు తదితర నేతలను తరుచూ విమర్శించే కిషన్‌రెడ్డి, బండి సంజయ్ వంటి నేతలు ఎస్ఎల్బీసీ ఘటనలో ఎందుకు మౌనంగా ఉన్నారన్న ప్రశ్న ఎదురవుతున్నది. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రోడ్డు యాక్సిడెంట్ బాధితులను పరామర్శించలేదంటూ బీజేపీ నేతలు కొన్నేండ్లపాటు నానాయాగీ చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కానీ ఎస్ఎల్బీసీ ప్రమాదం సమయంలో సీఎం రేవంత్‌రెడ్డి రాజకీయ పర్యటనలు చేస్తూ, ఎన్నికల ప్రచారం చేస్తున్నా కనీసం విమర్శించకపోవడంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.