హైదరాబాద్, మార్చి 15 (నమస్తే తెలంగాణ): ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో కాంగ్రెస్ సర్కార్ కొండను తవ్వి ఎలుకను పట్టిందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వ్యాఖ్యలు స్పష్టం చేస్తున్నాయి. శనివారం అసెంబ్లీ లాబీలో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ఫార్ములా-ఈ రేస్‌ను హైదరాబాద్‌లో నిర్వహించడాన్ని తాము ఎప్పుడూ తప్పు పట్టలేదని, అయితే చెల్లింపుల విషయంలో ప్రొసీజర్ ఫాలో కాలేదని మాత్రమే చెప్పామని ఆయన పేర్కొన్నారు.
ఈ-రేస్ వ్యవహారంలో కేటీఆర్‌తో పాటు పలువురిపై కేసులు, ఏసీబీ విచారణ అంటూ ఊదరగొట్టి ప్రభుత్వం ఇప్పుడు యూ టర్న్ తీసుకున్నదని మంత్రి శ్రీధర్‌బాబు చేసిన వ్యాఖ్యలను బట్టి తేలిపోయిందని సోషల్ మీడియాలో నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.
మరోవైపు ఫార్ములా ఈ-రేస్‌పై నమోదైన కేసును బీఆర్ఎస్ మొదటి నుంచి లొట్టపీసు కేసుగా అభివర్ణిస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ప్రపంచ ప్రఖ్యాత ఫార్ములా ఈ-రేస్ నిర్వహణ కోసం నిధుల విడుదలకు అప్పటి మంత్రి హోదాలో కేటీఆర్ అనుమతినిస్తే ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి నానాయాగీ చేశారని బీఆర్ఎస్ పునరుద్ఘాటించింది. రేవంత్‌రెడ్డి సర్కార్ అధికారంలోకి రాగానే ఫార్ములా ఈ-రేస్‌ను ఏకపక్షంగా రద్దు చేశారు. పర్యావరణానికి మేలు చేసే ఎలక్ట్రిక్ వాహనాల ప్రమోషన్ కోసం అప్పటి ప్రభుత్వం ఎంతో శ్రమ పడి ఫార్ములా ఈ -రేస్ హైదరాబాద్‌కు తెచ్చిన విషయాన్ని బీఆర్ఎస్ గుర్తుచేస్తున్నది. 2023లో హైదరాబాదు లో నిర్వహించిన తొలివిడత ఫార్ములా ఈ -రేస్‌తో రాష్ర్టానికి దాదాపు రూ .700 కోట్ల పరోక్ష లబ్ధి చేకూరిందని పేర్కొన్నది.