హైదరాబాద్, సెప్టెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : ఇప్పుడున్నంత అహంకార, విధ్వంస పూరిత సర్కారును తానెప్పుడూ చూడలేదని ఎస్టీయూటీఎస్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, జాక్టో మాజీ చైర్మన్ భుజంగరావు అసహనం వ్యక్తంచేశారు. అబద్ధాలాడటంలో సీఎం రేవంత్‌రెడ్డి నంబర్ వన్ అని, ఆయన మోసకారి అని విమర్శించారు. ప్రభుత్వ తీరుపై ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తున్నదని చెప్పారు. మంగళవారం ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడిన ఆయన టీచర్స్ డే సందర్భంగా విద్యాశాఖ మంత్రిగా ఉండి టీచర్లకు అవార్డులిచ్చే తీరిక రేవంత్‌రెడ్డికి లేదా? అని ప్రశ్నించారు. పక్కరాష్ట్రంలో వరదలొచ్చినా టీచర్స్‌డే సందర్భంగా సీఎం చంద్రబాబు ఉపాధ్యాయులకు అవార్డులిచ్చారని, ఈ సంస్కారం రేవంత్‌రెడ్డికి లేదా? అని నిలదీశారు. టీచర్స్‌డే రోజునే సీఎం రాష్ట్రంలోని టీచర్లను అవమానించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘సీఎం రెండుసార్లు మీటింగ్ పెడితే ఉద్యోగులు, ఉపాధ్యాయులంతా పోలోమని పోయిండ్రు. సభలో సీఎం బ్రహ్మాండమైన ప్రసంగం చేసిండు. కానీ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు కల్పించే ఒక్క ప్రకటన కూడా చేయలేదు’ అని దుయ్యబట్టారు.
‘మార్పు మార్పు అని మేము కాంగ్రెస్ వెంట పరిగెడితే ఉద్యోగులకు ఒరిగిందేమీ లేదు. ఐదు శాతం ఐఆర్, ఆరు గ్యారెంటీలు అటకెక్కినయి.. ఐదు డీఏలు అడ్రస్‌లేకుండా పోయినయ్. 18.7శాతం ఉద్యోగులకు డీఏ రావాల్సి ఉన్నది. ఒక్కో టీచర్, ఉద్యోగికి నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు సర్కారు బాకీపడింది. రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ తప్ప ఒక్క ప్రయోజనం అందలేదు. పిల్లల పెండ్లిళ్లు చేద్దామన్నా.. ఇల్లు కట్టుకుందామన్నా రిటైర్మెంట్ బెన్ఫిట్లు రావడం లేదు. హెల్త్‌కార్డుల ఊసేలేదు. మెడికల్, జీపీఎఫ్, సరెండర్ లీవుల బిల్లులు పెడింగ్‌లోనే ఉన్నయ్’ అని చెప్పారు.
‘మేధావులమని గొప్పలు చెప్పుకునే కోదండరాంరెడ్డి, ఆకునూరి మురళి ఎక్కడికి పోయిండ్రు? మీకు ప్రజలు, విద్యార్థుల కష్టాలు పట్టవా? గురుకులాల్లో పురుగులన్నం పెడుతున్నరు. ఆర్జీయూకేటీ, పాలమాకుల గురుకులాల పిల్లలు రోడ్డెక్కిండ్రు. దీనిపై మీరెందుకు స్పం దించరు? మీ గొంతులను అమ్మేసుకున్నరా? మీ వ్యక్తిత్వాన్ని కుదువపెట్టిండ్రా? ఒకటో తేదీన వేతనాలిస్తున్నానని గొప్పలు చెప్పుకుంటున్నరు. చాలా జిల్లాల్లో ఇంత వరకు వేతనాలు రాలేదు. దీనిపై ఎందుకు మీరు మాట్లాడటంలేదు? డీఎస్సీ నిర్వహణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఏకంగా డీఎస్సీ ఫైనల్ కీలో తప్పులున్నాయంటే ఇదేం ప్రభుత్వమన్న అనుమానాలొస్తున్నాయి. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విద్యా కమిషన్‌ను పూర్తిగా పునరావాసకేంద్రంగా మార్చేసిన ఘనత రేవంత్‌రెడ్డి సర్కారుదే’ అంటూ మండిపడ్డారు.
‘ఏ మాటకామాట చెప్పుకోవాలి. రాజకీయాలు అవసరంలేదు. కేసీఆర్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ మనిషి. అడగకముందే అన్నీ ఇచ్చే మనసున్న మారాజు. కొత్త రాష్ట్రం.. కొత్త సంసారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అవగాహనే రాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఆగమైన తెలంగాణలో అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పీఆర్సీని జీవితంలో ఎవరూ మరిచిపోరు. మొదట 43శాతం ఫిట్మెంట్ ఇచ్చిన మనసున్న మారాజు కేసీఆర్. రెండో పీఆర్సీలో 30శాతం ఫిట్మెంట్ ఇచ్చారు. రెండు పీఆర్సీలు కలిపితే 73శాతం ఫిట్మెంట్ ప్రకటించిన గొప్ప నేత. ఎన్నికల ముందు 5 శాతం ఐఆర్ ప్రకటించారు. మళ్లీ పవర్లోకి వస్తే కడుపునిండా పీఆర్సీ ఇస్తా నన్ను నమ్మండి అన్నడు. కానీ మార్పు అని కాంగ్రెస్‌ను నమ్మితే నట్టేట ముంచిండ్రు.’ అంటూ నాటి రోజులను గుర్తుచేస్తూనే కాంగ్రెస్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు.
‘గతంలో ప్రగతిభవన్‌లో మీటింగ్ పెడితే ఉద్యోగులు, ఉపాధ్యాయ సంఘాలు కొట్లాడినంత పనిచేసినయ్. కేసీఆర్‌తో అంశాల వారీగా అందరూ కొట్లాడిండ్రు. ఓ రకంగా ఆయనతో యుద్ధమే చేసిండ్రు. ఇప్పుడు యుద్ధం కాదు కదా కనీసం మాట్లాడే సాహసం కూడా చేయడం లేదు. ఏం గొంతు చచ్చిపోయిందా? ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు మనస్సులో అంత బాధపెట్టుకొని ఎందుకు భయపడుతున్నరు? ఒక్కటంటే ఒక్క ఆర్థిక ప్రకటన ఇప్పించడంలో ఎందుకు విఫలమైండ్రు? దీనికి సంఘాల నేతలే సమాధానం చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. ‘సమస్యలపై సంఘాలు ఎందుకింత మౌనంగా ఉన్నాయని ఉద్యోగులు నిలదీస్తున్నరు. అంతా ఫోన్లు చేసి ఆవేదన వ్యక్తంచేస్తున్నరు. ఇదేం ప్రభుత్వం?. ఇదేం ప్రజాపాలన అని ప్రశ్నిస్తున్నరు. పీఆర్సీపై ఇప్పటికీ సంఘాలు ఎందుకు మాట్లాడటంలేదని నిలదీస్తున్నరు. ఎవరూ మాట్లాడే ధైర్యం చేయడంలేదేందుకని రగిలిపోతున్నరు’ అని భుజంగరావు ఆవేదన వ్యక్తంచేశారు.