హైదరాబాద్, ఫిబ్రవరి 9(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్కు బీజేపీతో ఎలాంటి స్నేహం లేదని మాజీ స్పీకర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి స్పష్టంచేశారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా శుక్రవారం సీఎం రేంవత్‌రెడ్డి చేసిన ఆరోపణలను పోచారం తప్పుబట్టారు. బీఆర్ఎస్.. బీజేపీ ఫ్రెండ్లీ పార్టీ అనడాన్ని రికార్డులనుంచి తొలగించాలని కోరారు.
కాంగ్రెస్ ఎన్నికల హామీ ప్రకారం రైతులకు ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీని వెంటనే అమలుచేయాలని బీజేపీ శాసనసభ్యుడు పాయల్ శంకర్ కోరారు. ఆరు గ్యారెంటీలు, ఎన్నికల హామీలను ఎప్పటివరకు అమలుచేస్తారో గవర్నర్ ప్రసంగంలో చెప్పలేదని అన్నారు. ఆదిలాబాద్ దవాఖానలో డాక్టర్ల నియామకం, డిఫెన్స్ ఎయిర్‌పోర్టు అభివృద్ధి చేసి అందుబాటులోకి తేవాలని కోరారు.
దేశవ్యాప్తంగా మతతత్వం క్యాన్సర్ కన్నా వేగంగా వ్యాప్తి చెందుతున్నదని, తెలంగాణకు కూడా అది పాకుతున్నదని ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ ఆందోళన వ్యక్తంచేశారు. ముస్లింలు ఎస్సీ, ఎస్టీలకన్నా వెనుకబడి ఉన్నట్టు సచార్ కమిటీ, రంగనాథ్ కమిషన్ సైతం పేర్కొన్నాయని గుర్తుచేశారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో గంగా జమునా తహజీబ్ వర్ధిల్లిందని కొనియాడారు.
ఒక్కో నియోజకవర్గానికి ఒక స్మాల్‌స్కేల్ ఇండస్ట్రీని ఏర్పాటు చేయాలని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కోరారు. హెచ్ఎండీఏ అధికారి శివబాలకృష్ణ అవినీతి బాగోతం బయటపడిన తరువాత సోమేశ్‌కుమార్ పేరుకూడా బయటకు వచ్చిందని, తమవద్ద అలాంటి చాలామంది పేర్లు ఉన్నాయని, ప్రభుత్వం కోరితే అందిస్తామని చెప్పారు.
ఎంపీ టికెట్ కోసమే రేవంత్‌రెడ్డిని జగ్గారెడ్డి పొగుడుతున్నారని మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆరోపించారు. తన పేరు చెప్పకపోతే జగ్గారెడ్డిని ఎవరూ పట్టించుకోరని, అందుకే తన పేరును వాడుతున్నారని ఎద్దేవాచేశారు. గతంలో రేవంత్ రెడ్డిపై జగ్గారెడ్డి చేసిన విమర్శలు అందరికీ గుర్తుకు వస్తున్నాయని చెప్పారు.
మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ పోస్టింగుల్లో పారదర్శకతకే పెద్దపీట వేస్తామని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. చెక్ పోస్టుల వద్ద పనిచేయని వారికి పోస్టింగుల్లో ప్రాధాన్యత ఇస్తామని, తకువ కాలం పనిచేసిన వారికి అవకాశం ఇస్తామ న్నారు.
గిరిజనుల ఆరాధ్యదైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని ఆప్షనల్ హాలిడేగా ప్రభుత్వం నిర్ణయించినట్టు ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలతో కలిసి మంత్రి కోమటిరెడ్డి విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్రంలో గొల్ల-కురుమలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు సీఎం అంగీకరించారని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు గొల్ల-కురుమల కార్పొరేషన్‌కు సీఎం ఆమోదం తెలిపారని చెప్పారు.
సేవాలాల్ జయంతిని ఆప్షనల్ హాలిడేగా ప్రకటించడం, హైదరాబాద్‌లో సేవాలాల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ఆమోదం తెలపడం పట్ల దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 14 నుంచి 16 వరకు ప్రభుత్వం ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలు జరుగుతాయని వెల్లడించారు.
మండలికి రాకుండా, సభ్యులకు క్షమాపణ చెప్పకుండా శుక్రవారం సభాసమయం వృథా అయ్యేందుకు సీఎం కారణమయ్యారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి అన్నారు. మండలి సభ్యులపై సీఎం వ్యాఖ్యలు గర్హనీయమని, శుక్రవారం మండలికి సీఎం రావాలని, సభ్యులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
మండలి సభ్యుల పట్ల సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతకరంగా ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భానుప్రసాద్ అన్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని బీఆర్ఎస్ హయాంలో మండలిలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపినట్టు గుర్తుచేశారు.
రాష్ట్రంలో ఉన్న 1.4 లక్షల మంది ఉపాధ్యాయులను సరైన పద్ధతిలో ఉపయోగించుకొని.. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని టీచర్ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి కోరారు. కొత్త ప్రభుత్వం సీపీఎస్ రద్దుపై సరైన వివరణ ఇవ్వాలని కోరారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించడాన్ని స్వాగతిస్తున్నట్టు నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి చెప్పారు. అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ.. రద్దీ దృష్ట్యా బస్సుల ట్రిప్పుల సంఖ్యను పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు.