హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): పెండింగ్ బిల్లుల కోసం ఏడాదిగా ఉద్యమిస్తున్న మాజీ సర్పంచులు మంగళవారం మరోసారి నిరసనకు ఉపక్రమించారు. సర్పంచుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ప్రజాభవన్ ఎదుట పడుకొని వినూత్నంగా నిరసన తెలిపారు. అనంతరం మహా అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని ఆందోళన చేశారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా ‘ఓ గాంధేయవాది మీనాక్షమ్మా.. గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యంలో భాగస్వాములైన మా పెండింగ్ బిల్లులు ఇప్పించడమ్మా’ అనే ప్లకార్డులు ప్రదర్శించడం గమనార్హం. నిరసన తెలిపిన మాజీ సర్పంచులను పోలీసులు బలవంతంగా తరలించారు. సర్పంచుల జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగయ్య, ఉపాధ్యక్షులు గుంటి మధూసూదన్రెడ్డి, కేశబోయిన మల్లయ్య, మేడబోయిన గణేశ్, నాయకులు పక్కిర బీరప్ప, వినోద్ అంజయ్యగౌడ్, బొట్ల రవీందర్, మన్నె పద్మారెడ్డి పాల్గొన్నారు.