హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వంపై తాజా మాజీ సర్పంచులు సమరశంఖం పూరించారు. పెండింగ్ బిల్లల కోసం పోరుబాట పట్టారు. తెలంగాణ సర్పంచుల సంఘం రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అసెంబ్లీ ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు. అసెంబ్లీలోని గాంధీ విగ్రహానికి వినతిపత్రాలు అందజేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి, పంచాయతీరాజ్‌శాఖ ముఖ్య కార్యదర్శి లోకేశ్‌కుమార్, వివిధ పార్టీల నాయకులకు వినతిపత్రాలను అందజేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 9 నెలలు కావస్తున్నా, తమ పదవీకాలం ముగిసి 8 నెలలు కావస్తున్నా పెండింగ్ బిల్లుల విడుదలతో జాప్యంపై జేఏసీ నేతలు ధ్వజమెత్తారు. గ్రామాల అభివృద్ధికి తాము ఖర్చుపెట్టిన పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్, ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బిల్లులు చెల్లించకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే అడ్డుకుంటామని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తాము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్రంలోని వివిధ పల్లెలకు అనేక జాతీయ అవార్డులు వచ్చాయని గుర్తుచేశారు.
అప్పులు చేసి, గ్రామాలను అభివృద్ధి చేసిన సర్పంచుల పదవీకాలం ముగిసినా కాంగ్రెస్ ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదని విమర్శించారు. దీంతో ఎందరో మాజీ సర్పంచుల కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. వడ్డీ వ్యాపారుల వేధింపులు తాళలేక కొందరు సర్పంచులు ఆత్మహత్య చేసుకొనే పరిస్థితులు దాపురించాయని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని యాదయ్యగౌడ్, మధుసూదన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో సంఘం జేఏసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి రాంపాక, రాష్ట్ర నాయకులు నాగయ్య, మెడబోయిన గణేశ్, నవీన్‌గౌడ్, మాట్ల మధు, సముద్రాల రమేశ్, శాతరాజుపల్లి ఆంజనేయులు, కొయ్యడ రమేశ్, నరబట్ట అజిత్‌బాబు, బాలస్వామి, పంపా కరుణాకర్, పంబ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.