మానకొండూర్, ఆగస్టు 30: కాంగ్రెస్ సర్కారు అనాలోచిత నిర్ణయంతో రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతున్నదని, కేసీఆర్ గుర్తుకొస్తారనే అక్కసుతోనే కాళేశ్వరం మోటర్లను ఆన్ చేయడం లేదని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ మండిపడ్డారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండల కేంద్రంలోని గడిమహల్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కేసీఅర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రైతుల సాగునీటి కష్టాలు తీర్చితే.. ఆయనపై కోపంతో రేవంత్ సర్కారు రైతుల నోట్లో మట్టికొడుతున్నదని విమర్శించారు. కాళేశ్వరం మోటర్లను ఆన్‌చేసి ఎత్తిపోతలు ప్రారంభిస్తే రైతులు కేసీఅర్‌ను గుర్తుచేసుకుంటారనే అక్కసుతోనే కాళేశ్వరం నీటిని సముద్రంపాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
జూలై, ఆగస్టు నెలల్లో రోజుకు 10 లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా పోయినా ప్రభుత్వం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. ప్రస్థుతం మేడిగడ్డ వద్ద లక్షా 75 వేల క్యూసెక్కుల నీరు వృథాగా పోతున్నదని, అయినా సర్కారుకు సోయిలేదని ఫైర్ అయ్యారు. మేడిగడ్డ బరాజ్ గేట్లు మూయకున్నా కన్నెపల్లి పంప్‌హౌజ్ ద్వారా నీళ్లు ఎత్తిపోయవచ్చని నీటిపారుదలశాఖ అధికారులే చెప్తున్నారని వెల్లడించారు. వర్షాలు లేక ఎల్ఎండీ రిజర్వాయర్ ఇప్పటికీ నిండలేదని, ఎల్లంపల్లి ద్వారా నీటిని ఎత్తిపోసి మిడ్‌మానేరు, ఎల్ఎండీ జలశాయాలను నింపాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో బీఅర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, మాజీ మేయర్ సర్దార్ రవీందర్‌సింగ్, బీఅర్ఎస్ కరీంనగర్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు.