హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ 10 నెలల పాలన తెలంగాణలోని ఏ ఒక్క వర్గానికీ నమ్మకం కల్పించలేకపోయిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు. రేవంత్‌రెడ్డి హయాంలో అన్ని రంగాలు కుదేలయ్యాయని, మద్యం అమ్మకాల్లో మినహా రాష్ట్ర ఆదాయం పడిపోయిందని ధ్వజమెత్తారు. కొవిడ్ కష్టకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు ఇచ్చి అన్నదాతలను ఆదుకుంటే.. కాంగ్రెస్ సర్కారు రైతుబంధును ఎగ్గొట్టి దగా చేసిందని, కేసీఆర్ పాలనకు, రేవంత్ పాలనకు మధ్య ఉన్న తేడా ఇదేనని పేర్కొన్నారు. తెలంగాణపై కేసీఆర్‌కు ప్రేమ ఉండబట్టే కొవిడ్ సంక్షోభ సమయంలో ప్రజల వద్దకు డబ్బులు చేర్చి ఆర్థికంగా రాష్ట్రం పడిపోకుండా చూశారని తెలిపారు. కొవిడ్ సంక్షోభం తర్వాత దేశంలోని అన్ని రాష్ట్రాలు ‘యూ’ ఆకారంలో నెమ్మదిగా కోలుకుంటే, కేసీఆర్ హయాంలో తెలంగాణ మాత్రం ‘వీ’ షేప్‌లో వేగంగా అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. ప్రస్తుతం రేవంత్ పాలనలో ‘యూ’ షేప్ లేదు, ‘వీ’ షేప్ లేదని, అంతా ‘జీరో’ షేపేనని ఎద్దేవా చేశారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో వినోద్‌కుమార్ సోమవారం విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సీఎం రేవంత్‌రెడ్డి ఉదయం సచివాలయంలో ఒకలా, రాత్రి ఐఎస్బీలో మరోలా మాట్లాడారని ఆక్షేపించారు. రాష్ట్ర ఆదాయం తగ్గినట్టు అనేక పత్రికల్లో కథనాలు వస్తున్నప్పటికీ ఆ అంశంపై రేవంత్ లోతుగా సమీక్ష చేయడంలేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఏ పల్లెకు వెళ్లినా ఎకరం రూ.20 లక్షలకుపైగానే ధర పలికేదని, ప్రస్తుతం హైడ్రా కూల్చివేతలతో రియల్ ఎస్టేట్ రంగం దారుణంగా దెబ్బతిన్నదని, ఫలితంగా రాష్ర్టానికి పెట్టుబడులు రావడం లేదని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రాజెక్టులకు నిధుల్లేని దుస్థితి నెలకొన్నదని, కానీ సీఎం రేవంత్ మాత్రం రాష్ట్ర జీఎస్డీపీని లక్ష కోట్ల డాలర్లకు, హైదరాబాద్ ఎకానమీని 60 వేల కోట్ల డాలర్లకు చేరుస్తానని గొప్పలు చెప్తున్నారని విమర్శించారు. ప్రస్తుతం దేశ ఆర్థిక రాజధాని ముంబై ఎకానమీ కూడా 300 బిలియన్ డాలర్లు మించలేదని గుర్తుచేశారు. గతంలో కరీంనగర్‌ను లండన్ చేస్తానని కేసీఆర్ చెబితే అపహాస్యం చేసిన పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు రేవంత్‌రెడ్డి చెప్తున్న ట్రిలియన్ డాలర్ల జీఎస్డీపీపై స్పందించాలని హితవు పలికారు.
అప్పులపై తప్పుడు ప్రచారం
కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పులపై సీఎం రేవంత్, మంత్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వినోద్‌కుమార్ ధ్వజమెత్తారు. ప్రస్తుతం ప్రతిరోజూ రూ.200 కోట్లు వడ్డీలు కడుతున్నట్టు మంత్రి సీతక్క చెప్పిన మాటలో వాస్తవం లేదని, దక్షిణాది రాష్ట్రాల్లో తక్కువ వడ్డీ కడుతున్నది తెలంగాణ రాష్ట్రమేనని తెలిపారు. ఆర్బీఐ గణాంకల ప్రకారం తమిళనాడు 19.25%, కేరళ 18.97%, ఆంధ్రప్రదేశ్ 14.69%, తెలంగాణ 13.69% వడ్డీ కడుతున్నాయని చెప్పారు. కేసీఆర్ అప్పులు తెచ్చి లక్షలాది రూపాయల ఆస్తులు సృష్టించారని పేర్కొంటూ.. కాంగ్రెస్ 10 నెలల పాలనలో చేస్తున్నదేమిటి? సాధించింది ఏమిటి?’ అని ప్రశ్నించారు. ఇప్పటికైనా సీఎం రేవంత్, మంత్రులు, కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు, స్థానిక నాయకులు తెలంగాణను చంపవద్దని, రాష్ట్ర పురోగతిని ఆపవద్దని హితవు పలికారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు రాజారాంయాదవ్, పల్లె రవికుమార్, భవానీ తదితరులు పాల్గొన్నారు.