హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన విజన్ 2047 డాక్యుమెంట్ అశాస్త్రీయంగా ఉందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు. విజన్ డాక్యుమెంట్లో బేసిక్ పాలసీ కింద తీసుకువచ్చిన ప్యూర్, క్యూర్, రేర్ అనే కాన్సెప్ట్ పూర్తిగా తప్పిదం అని తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ విస్తృతమైన తెలంగాణను గ్రామీణ తెలంగాణం అనడం తప్పని, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, ఖమ్మం వంటి ప్రాంతాల్లో ఎన్నో పరిశ్రమలు ఉన్నాయని, వాటిని గ్రామీణ ప్రాంతాలుగా ముద్రవేసే హక్కు రేవంత్‌రెడ్డికి ఎవరిచ్చారు? అని నిలదీశారు.
ఆశించినంతగా పెట్టుబడులు లేవు
ప్రభుత్వాలు సమ్మిట్లు పెట్టడంలో తప్పు లేదని, కానీ అంతగా పెట్టుబడులు ఆకర్షించలేకపోవడమే తప్పని దుయ్యబట్టారు. ఏదో రాబోతున్నదని ప్రజలను మభ్యపెట్టవద్దని కోరారు. ఒక వైపు రేవంత్‌రెడ్డి తెలంగాణ దివాలా తీసిందని, అప్పులు పుట్టడం లేదని, ఢిల్లీకి పోతే చెప్పులెత్తుకపోయిన వారి మాదిరిగా చూస్తున్నారని మాట్లాడుతుంటే రాష్ట్రం పరిస్థితి మరింత అధ్వానమే అవుతుంది తప్ప మరేమీ ప్రయోజనం ఉండదన్నారు.
దివాలా తీసిందని అనొద్దు
గ్లోబల్ సమ్మిట్లను నిర్వహించేటప్పుడు ఇకనుంచైనా తెలంగాణ దివాలా తీసిందని, ఇక్కడేమీ లేదన్నట్టుగా చెప్ప డం తప్పని చురకలంటించారు. రెండు సంవత్సరాలుగా సీఎం మాట్లాడుతున్న తీరు ఎంతో బాధ కలిగించిందని తెలిపారు. తెలంగాణ ప్రజల అభివృద్ధి ఆకాంక్షించే వాడిగా, ఇకనైనా తెలంగాణ దివాలా తీసిందని మాట్లాడవద్దని రేవంత్‌రెడ్డికి హితవు పలికారు. భవిష్యత్తులో ఫ్యూచర్ సిటీలు ఎన్ని కట్టినా, హైదరాబాదు.. హైదరాబాదే అని స్పష్టం చేశారు. దానిని విస్తరించుకుంటూ పోవాలే కానీ, కొత్తగా కడుతానంటే, ‘రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే’ అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు.