కార్పొరేషన్, ఫిబ్రవరి 8: ‘నేషనల్ హెరాల్డ్ అవినీతిపై కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్‌గాంధీలను ఈడీ, సీబీఐ విచారించాయి. రెండున్నర ఏండ్లు గడిచినా ఇంతవరకు వారిని అరెస్టు చేయలేదు. అంటే.. ఈ విషయంలో సోనియా, మోదీ కుమ్మక్యయ్యారని అనుకోవచ్చా?’ అని మాజీ ఎంపీ వినోద్‌కుమార్ సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. కానీ తాను ఈ విషయంలో న్యాయ సూత్రాలు తెలిసిన వ్యక్తిగా బాధ్యతతో వ్యవహరిస్తున్నట్టు పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కరీంనగర్‌లోని పలు డివిజన్లలో బీఆర్ఎస్ తరఫున ప్రచారం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి లీగల్ అంశాలను దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంశంపై నియమితులైన ఘోష్ కమిటీ నివేదికపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, ఐఏఎస్ అధికారులు, ఇంజినీర్లు తమపై ఎలాంటి చర్య లు తీసుకోవద్దని న్యాయస్థానం నుంచి స్టే తీసుకున్నారని, ఇది అందరికీ తెలిసిన విషయమేనని పేర్కొన్నారు. ప్రచారంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నాయకులు పాల్గొన్నారు.