దుబ్బాక, జూన్ 27: సీనియర్ రాజకీయ నాయకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు సోలిపేట రామచంద్రారెడ్డి (88) కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో మంగళవారం ఉదయం తుది శ్వాసవిడిచారు. రామచంద్రారెడ్డి స్వల్ప అస్వస్థతకు గురై మరణించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. సోలిపేట మృతిపట్ల ఆయన స్వగ్రామమైన సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం చిట్టాపూర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. రామచంద్రారెడ్డి మృతిపట్ల సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిటీ కాలేజీలో డిగ్రీ చదివిన సోలిపేట విద్యార్థి దశ నుంచే రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నారు. తొలితరం కమ్యూనిస్టు నాయకుల స్ఫూర్తితో తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొన్నారు. అనంతరం రాజకీయాల్లో అడుగుపెట్టారు. స్వగ్రామమైన చిట్టాపూర్ తొలి సర్పంచ్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. అనంతరం దుబ్బాక సమితి అధ్యక్షుడిగా, సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు అధ్యక్షుడిగా పనిచేశారు. 1972లో కాంగ్రెస్ నుంచి దొమ్మాట ఎమ్మెల్యేగా నియోజకవర్గ ప్రజలకు సేవలందించారు. టీడీపీలో చేరి రాష్ట్ర కార్యదర్శిగా, రాజ్యసభ సభ్యుడిగా, రాజ్యసభలో టీడీపీ ఫ్లోర్ లీడర్‌గా పలు హోదాల్లో పనిచేశారు. ఇటీవల కాలంలోనూ భారత-చైనా మిత్రమండలికి అధ్యక్షుడిగా, సీఆర్ ఫౌండేషన్, తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్ సంస్థల్లో సభ్యుడిగా కొనసాగారు. సెంట్రల్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్, పంచాయతీరాజ్ కార్యక్రమామాల్లో రెగ్యులర్ విజిటర్‌గా ఉన్నారు. 70 ఏండ్లపాటు రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించి, మచ్చలేని వ్యక్తిగా పేరొందారు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డికి ఈయన చిన్నాన్న అవుతారు. రామచంద్రారెడ్డికి భార్య కిష్టమ్మ, ఇద్దరు కుమారులు వెంకటేశ్వర్‌రెడ్డి, జగపతిరెడ్డి, ఒక కుమార్తె ఉన్నారు.
సోలిపేట జీవితం ఆదర్శనీయం..సంతాపం ప్రకటించిన మంత్రులు
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో రామచంద్రారెడ్డి పాత్ర స్ఫూర్తిదాయకమని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోలిపేట జీవితం నేటి తరానికి ఆదర్శప్రాయమని ఐటీ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సోలిపేట మృతిపట్ల మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మం త్రులు వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, వీ శ్రీనివాస్‌గౌడ్, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, మహమూద్‌అలీ, నిరంజన్‌రెడ్డి, సత్యవతిరాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్‌కుమార్, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఎంపీ సంతోష్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీలు సంతాపం తెలిపారు.
రామచంద్రారెడ్డి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి మృతిపట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతాపం ప్రకటించారు. తొలితరం కమ్యూనిస్టు నేతగా, నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న సోలిపేట జీవితం ఆదర్శనీయమని పేర్కొన్నారు. సర్పంచ్ నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా ప్రజాజీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగారని, ఆయన జీవితం రేపటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. సిద్దిపేట ప్రాంతవాసిగా, రాజకీయ, సామాజిక రంగాల్లో ఆయన ఆచరించిన కార్యాచరణ, ప్రజాజీవితంలో కొనసాగుతున్న తమలాంటి ఎందరో నేతలకు ప్రేరణగా నిలిచిందని గుర్తుచేసుకొన్నారు. సోలిపేట మరణంతో తెలంగాణ మరో తొలితరం ప్రజానేతను కోల్పోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.