హైదరాబాద్ జూన్ 17 (నమస్తేతెలంగాణ) : బీఆర్ఎస్ నిరంతర కృషి ఫలితంగానే కేంద్రం రాష్ర్టానికి ఏడు నవోదయ స్కూళ్లు మంజూరు చేసిందని మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు వ్యాఖ్యానించారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. భద్రాద్రికొత్తగూడెం, జగిత్యాల, మహబూబ్నగర్, మేడ్చల్, నిజామాబాద్, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాల్లో నవోదయ స్కూళ్లు ఏర్పాటుచేయనున్నారని తెలిపారు.
వీటి ఏర్పాటుతో రాష్ట్రంలో నవోదయ పాఠశాలల సంఖ్య 16కు చేరనున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలకు అనుగుణంగా నవోదయ పాఠశాలలు ఏర్పాటుచేయాలని కేంద్రంపై ఒత్తిడి తేవడంతోపాటు అనేకసార్లు లేఖలు రాశామని, మాజీ సీఎం కేసీఆర్ సైతం పలుమార్లు కేంద్ర మంత్రులకు విజ్ఞప్తిచేసినట్టు గుర్తుచేశారు. రాష్ట్రానికి 21 నవోదయ పాఠశాలలు అవసరముండగా, ఏడు మాత్రమే మంజూరు చేయడంపై అసంతృప్తి వ్యక్తంచేశారు.