BRS | హైదరాబాద్, మార్చి 4 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్ర నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు ఊపందుకొన్నాయి. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పార్టీ విధానాలు నచ్చిన పలువురు మహారాష్ట్ర సీనియర్ రాజకీయ నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. తాజాగా మహారాష్ట్ర సీనియర్ రాజకీయ నేత, మాజీ ఎంపీ, ఆమ్ఆద్మీ పార్టీ మహారాష్ట్ర ఉపాధ్యక్షుడు హరిభావు రాథోడ్.. ఆప్‌కు రాజీనామాచేసి బీఆర్ఎస్లో చేరారు. సీఎం కేసీఆర్ సమక్షంలో శనివారం బీఆర్ఎస్ కండువా కప్పుకొన్నారు. ఆయనతోపాటు చంద్రాపూర్ జడ్పీ మాజీ వైస్ చైర్మన్ సందీప్ కరపే, గోండ్ పిప్రీ నగర్ సేవక్, బీజేపీ తాలూకా అధ్యక్షుడు బాబన్ నికోడే, శివసేన తాలూకా కోఆర్డినేటర్ ఫిరోజ్ ఖాన్, బీజేపీ నాయకుడు శైలేశ్సింగ్ బైసె తదితరులు బీఆర్ఎస్లో చేరారు.
హరిభావు రాథోడ్ మహారాష్ట్రలో 2004 నుంచి 2008 వరకు యవత్మాల్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. మహారాష్ట్రలో బీజేపీ బలోపేతానికి కృషి చేశారు. 2013 నుంచి 2021 వరకు కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన ఆయన, ఆ తరువాత ఆప్‌లో చేరారు. నేషనల్ కమిషన్ ఫర్ డీనోటిఫైడ్ అండ్ నొమాడిక్ ట్రైబ్స్ సభ్యుడిగా వ్యవహరించారు. ఆల్ ఇండియా బంజారా క్రాంతిదళ్ను స్థాపించి మహారాష్ట్రలో విస్తృతంగా సేవలందించారు.
దేశం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం చూపగల దార్శనిక నాయకుడిగా సీఎం కేసీఆర్ తనకు కనిపిస్తున్నారని హరిభావు రాథోడ్ అన్నారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో కేసీఆర్ లాంటి నాయకుడిని చూడలేదని చెప్పారు. సుదీర్ఘకాలం ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి, రాష్ర్టాన్ని సాధించటమే కాకుండా సాధించిన రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ప్రగతిపథంలో నడిపిస్తున్న నాయకుడు కేసీఆర్ ఒక్కరేనని కొనియాడారు. ఇటీవల నాందేడ్‌లో నిర్వహించిన సమావేశంలో కేసీఆర్ చేసిన అనేక ప్రతిపాదనలపై మహారాష్ట్ర వ్యాప్తంగా విస్తృత చర్చ సాగుతున్నదని చెప్పారు. తెలంగాణ వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలు సాధించిన ప్రగతి దేశానికి దిక్సూచిగా నిలిచాయని అన్నారు.