హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ద్వేషానికే అధిక ప్రాధాన్యమిస్తున్నారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు. బుధవారం తెలంగాణ భవన్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఎన్డీఎస్ఏ(నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) అనేది కేవలం సలహాలు ఇచ్చే సంస్థ మాత్రమేనని, అది నియంత్రణ సంస్థ కాదని స్పష్టంచేశారు. 16 నెలల క్రితం ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికలో ప్రాజెక్టుల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వమే యజమాని అని పేరొన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కేవలం రాజకీయ కక్షతోనే ప్రభుత్వం ఎన్డీఎస్ఏను సాకుగా చూపి ప్రాజెక్టులను నిలిపివేస్తున్నదని విమర్శించారు. వర్షాభావ పరిస్థితుల్లో కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని లిఫ్ట్ చేయాలని తాము మొత్తుకున్నా ప్రభుత్వం పెడచెవిన పెడుతుందని ధ్వజమెత్తారు. నీటిని లిఫ్ట్ చేయకపోతే త్వరలోనే హైదరాబాద్‌లో ముఖం కడుక్కునేందుకూ నీరు దొరకని పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు.
పోలవరం ప్రాజెక్టును ఉదాహరణగా చూపి స్తూ.. ప్రాజెక్టుల నిర్వహణలో ప్రభుత్వం అనుసరించాల్సిన బాధ్యత గురించి వినోద్‌కుమార్ వివరించారు. ‘పోలవరం ప్రాజెక్టు అథారిటీ‘ వార్షిక నివేదిక ఆధారంగా ఈ అంశాలను ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టులో ఇంప్రాపర్ ప్లానిం గ్, డిజైన్ ఫెయిల్యూర్స్, క్వాలిటీ లోపాలు, సరైన ఇన్వెస్టిగేషన్ లేక సుమారు రూ.9,600.16 కోట్ల నష్టం వాటిల్లినట్టు ఈ సందర్భంగా గుర్తుచేశారు. అయినప్పటికీ పోలవరం ప్రాజెక్టును కేంద్రం ‘జాతీయ ప్రాజెక్టు‘గా గుర్తించిందని పేర్కొన్నారు. పోలవరం విషయంలో ఎన్డీఎస్ఏ ఎకడా అడ్డుపడలేదని, కాళేశ్వరం విషయంలో మాత్రం ఎందుకు వివక్ష చూపుతుందో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఎన్డీఎస్ఏ కేవలం సలహాలు ఇచ్చే సంస్థ మాత్రమేనని, కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కక్ష సాధింపు కోసమే ఎన్డీఎస్ఏ నివేదికను సాకుగా చూపిస్తుందని ఆరోపించారు. చంద్రబాబు, జగన్ మధ్య ‘పాము-ముంగీస’ లాంటి రాజకీయ వైరం ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రయోజనాల మేరకు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపలేదని వినోద్‌కుమార్ గుర్తుచేశారు. ఆ రాజకీయ పరిణతినే తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రదర్శించాలన్నారు. రాష్ట్రంలోని ప్రాజెక్టుల విషయంలో రాజకీయాలు మాని బాధ్యతగా పని చేయాలని సూచించారు. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేస్తామని, మిగిలిన సమయంలో అభివృద్ధిపై దృష్టి పెడతామని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఇప్పుడు ఆ మాటకు కట్టుబడి ఉండాలని హితవు పలికారు. సమావేశంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.