హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తేతెలంగాణ): సింగరేణి సంస్థ 2023-24లో రూ.4,701 కోట్ల లాభాలు ఆర్జించిందని, కానీ ప్రభుత్వం రూ.2,412 కోట్లకు పరిమితం చేసి అందులో 33 శాతం వాటా మాత్రమే కార్మికులకు ఇచ్చి వారి పొట్టగొట్టిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ విమర్శించారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. రూ.2,289 కోట్ల లాభాలకు సంబంధించిన బోనస్ ఎగ్గొట్టిందని, వాస్తవానికి ఇచ్చింది 16.90 శాతమేనని ఆరోపించారు.
బోనస్ సింగరేణి కార్మికుల హక్కు అని, కాంగ్రెస్ సర్కారు కార్మికులకు ఎక్కువ బోనస్ ఇచ్చామని చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. సింగరేణి అభివృద్ధి పేరుతో లాభాలను తగ్గించి చూపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో సింగరేణి ఆల్‌టైం రికార్డు ఉత్పత్తి సాధించిందని, అయినా ఒక్కో కార్మికుడికి గతేడాది కంటే రూ.20 వేలు మాత్రమే అదనంగా బోనస్ ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పాలనలో ఏనాడూ ఇలా లాభాలను తగ్గించి చూపలేదని తెలిపారు.