యాదగిరిగుట్ట, ఫిబ్రవరి 26: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి కల్యాణ లక్ష్మీనరసింహస్వామి వారు దివ్య విమానరథంలో భక్తులకు దర్శనమిచ్చారు. వివిధ రకాల పుష్పాలు, మామిడి, అరటి తోరణాలతో స్వామివారి దివ్య విమాన రథాన్ని శోభాయమానంగా అలంకరించి, విష్వక్సేనుడికి తొలి పూజలతో రథోత్సవాన్ని ఆరంభించారు.
పట్టువస్ర్తాలు, బంగారు, వెండి, ముత్యాల ఆభరణాలతో కల్యాణ దంపతులైన లక్ష్మీనారసింహస్వామిలను దివ్య మనోహరంగా అలంకరించి వేదమంత్రాలు, మంగళవాయిద్యాల నడుమ దివ్య విమాన రథంపై ఊరేగించారు.
తిరుకల్యాణ వేడుకలతో లక్ష్మీనాథుడైన స్వామివారు విష్ణుమూర్తి అలంకారంలో తన ఇష్టవాహనమైన గరుత్మంతుడిపై దేవేరి శ్రీమహాలక్ష్మీ అమ్మవారి సమేతంగా ఆలయ తిరువీధుల్లో ఊరేగారు. ఈ వేడుకలో ఆలయ అనువంశికధర్మకర్త బీ నరసింహమూర్తి, ఈవో భవానీశంకర్, డీఈవో దోర్బల భాస్కర్శర్మ, ప్రధానార్చకులు కాండూరి వేంకటాచార్యులు, బీ సురేంద్రాచార్యులు తదితరులు పాల్గొన్నారు.