సూర్యాపేట టౌన్, ఫిబ్రవరి 21 : కృష్ణా నీటిని అక్రమంగా ఆంధ్రాకు తరలిస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు ప్రభుత్వంలోని పెద్దలు పట్టించుకోకపోవడం దారుణమని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం ఆయన సూర్యాపేటలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. నాగార్జునసాగర్‌కు వెయ్యి టీఎంసీల నీరు వస్తే అందులో 60 శాతం ఆంధ్రా, 40 శాతం తెలంగాణ వాడుకోవాల్సి ఉండగా, ఇప్పటి వరకు 10 వేల క్యూసెక్కుల నీటిని దొంగతనంగా ఆంధ్రాకు తరలించారని మండిపడ్డారు.
ఏపీ ప్రభుత్వం తమ వాటా నీటినే కాకుండా అదనంగా తరలించుకుపోతున్నా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నోరు మెదపకపోవడం దారుణమని అన్నారు. కృష్ణా జలాలను ఏపీకి అక్రమంగా తరలిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంలో కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)ని ప్రశ్నించి ఢిల్లీలో ధర్నా చేస్తామని బీఆర్ఎస్ నాయకుడు హరీశ్‌రావు హెచ్చరించిన తర్వాత కాంగ్రెస్ నాయకులు కృష్ణా జలాలపై మాట్లాడటం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎంపీలు ఉన్నారని, అందులో బండి సంజయ్, కిషన్‌రెడ్డి కేంద్ర మంత్రులుగా ఉన్నప్పటికీ ఈ విషయమై స్పందించకపోవడం అన్యాయమని అన్నారు. తెలంగాణ వాటా ప్రకారం కృష్ణా జలాలను పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ హయాంలో రెండు పంటలకు నీళ్లు..
బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఏడాదికి రెండు పంటలకు నీళ్లిచ్చిన విషయాన్ని బడుగుల గుర్తుచేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో లిఫ్ట్‌ల ద్వారా లక్ష ఎకరాలకు, నాగార్జునసాగర్ ద్వారా 4.50 లక్షల ఎకరాలకు, ఎస్ఎల్బీసీ ద్వారా రెండున్నర లక్షల ఎకరాలకు నీళ్లిచ్చినట్టు చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు సన్నాయి నొక్కులకు, మాయమాటలకు రేవంత్‌రెడ్డి లొంగిపోయి తెలంగాణను ఎడారిలా మార్చేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. భవిష్యత్తులో సూర్యాపేట, నల్లగొండ, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల ప్రజలు తాగునీటికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. శ్రీశైలం వద్ద ఆంధ్రా బలగాలు ఉంటే నాగార్జునసాగర్ దగ్గర కేంద్ర బలగాలను పెట్టడం ఏంటని ప్రశ్నించారు.