తిమ్మాపూర్, ఆగస్టు 20 : రైతులకు సరిపడా యూరియా ఇచ్చేదాకా ఊరుకునేది లేదని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. కరీంనగ్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ సొసైటీ గోదాం వద్ద బుధవారం తెల్లవారుజామునుంచే రైతులు బారులు తీరగా ఆయన చేరుకొని పార్టీ నాయకులు, రైతులతో కలిసి నుస్తులాపూర్ స్టేజీ రాజీవ్హ్రదారిపై ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానకొండూర్ నియోజకవర్గంలో రైతులకు సరిపడా యూరియా అందజేయాలని డిమాండ్ చేశారు. తెల్లవారుజాము నుంచే పనులన్నీ వదులుకుని రైతుల కుటుంబం మొత్తం యూరియా కోసం వచ్చినా సరిపడా దొరకడం లేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ముందుచూపుతో రైతులకు ఇబ్బందులు లేకుండా చేశారని గుర్తుచేశారు. రైతులు ఇంతలా ఇబ్బందులు పడుతుంటే సొసైటీ చైర్మన్లను పార్టీలో చేర్చుకుని, యూరియా ఇచ్చేందుకు ఒక్క రివ్యూకూడా చేయలేదని విమర్శించారు. ధర్నాలో బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణరావు తదితరులు పాల్గొన్నారు.