పెద్దపల్లి : సీఎం రేవంత్ రెడ్డికి మతి భ్రమించి మాట్లాడుతున్నాడు. ఆయనతోపాటు మొత్తం మంత్రివర్గాన్ని రీ కాల్ చేయా అని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. మంగళవారం మంథని బీఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆయన ఎంత ఎత్తు ఉన్నడో అంతే మెదడు ఉందని సీఎంను ఘాటుగా విమర్శించారు. మీ ఎత్తుకన్న తక్కువ మెదడు ఉన్నట్టు మాట్లాడుతున్నావని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి పిచ్చిపట్టినట్టు మాట్లాడితే ఊరుకోమన్నారు. రేవంత్ రెడ్డిని ఎర్రగడ్డ హాస్పిటల్‌కు తరలించాలని రాష్ట్రపతిని కోరుతున్నామన్నారు. హైట్‌కి తగ్గట్టు మెదడు పెంచుకోవాలని రేవంత్‌కు సూచించారు.
నీకు తెలివి లేదు, నీ పక్కన ఉన్న మంత్రులకు తెలివి లేదన్నారు. ఎల్లంపల్లి ప్రారంభించింది 2004లో.. పూర్తయింది 2016లో అలాంటప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ను శ్రీపాద ఎలా కట్టాడు? శ్రీపాద రావు చనిపోయింది 1999లో అని గుర్తు చేశారు. పొడుగున్నోనికి తెలివిలేదంటూ హరీశ్ రావును అవహేళన చేసేలా మాట్లాడావు. పొట్టిగున్న నీకేముంది? కాళేశ్వరం కూలిపోలేదు, నీ ముఖం కూలిపోయిందన్నారు. కాంగ్రెస్ మంత్రి వర్గం తెల్లకల్లు తాగిన కోతిలాగ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా తెలివిగా వ్యవహరించండి. అన్నారం, సుందిల్ల బ్యారేజీలను వాడండి. లక్షల క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రం పాలవుతున్నాయి. ఇప్పటికైనా ప్రజలకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.