నర్సంపేట, జనవరి 10 : రైతుల బోనస్ ఎగవేతకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రచేస్తున్నదని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన వరంగల్ జిల్లా నర్సంపేటలో మీడియాతో మాట్లాడారు. నెల రోజులుగా రైతులకు బోనస్ అందలేదని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఎగవేతకు సన్నాలకు బోనస్‌తో కుట్ర చేసిందని ఆరోపించారు. రుణమాఫీ, రైతు భరోసా, బోనస్ చెల్లించడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. బోనస్ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం రైతు నెత్తిన కుచ్చుటోపి పెట్టిందని దుయ్యబట్టారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 33,958 మంది రైతులకు రూ.85.24 కోట్ల బోనస్ డబ్బులు రాలేదని తెలిపారు. ఇది కాంగ్రెస్ దిగజారుడుతనానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఇచ్చిన మాట ప్రకారం బోనస్ డబ్బులు వెంటనే రైతుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. యూరియా కొరత, కరెంటు కోత, రైతుభరోసా, బోనస్ అందక రైతులు గోస పడుతున్నారని తెలిపారు.