కాళ్లకింది నేల కదులుతున్న హెచ్చరికలు.. ప్రభుత్వ వైఫల్యాలు.. ప్రజావ్యతిరేకత.. వెంటాడుతున్న ఓటమి భయంతో కాంగ్రెస్ నేతలు గూండాగిరీకి దిగుతున్నారు. కోస్గిలో బీఆర్ఎస్ అభ్యర్థిని కిడ్నాప్ చేసి, పార్టీలో చేర్చుకోవడం, అలియాబాద్‌లో నేతలపై దాడులకు తెగబడటం ఆ దౌర్జన్యాల్లో కొన్ని మాత్రమే.
మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి నిలబడిన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఎత్తుకెళ్లి గంటల్లోనే కాంగ్రెస్ కండువా కప్పి తమ పార్టీలో చేరినట్టు కథ నడిపించారు. ఇదంతా సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి డైరెక్షన్లోనే కొనసాగడం గమనార్హం. నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మున్సిపాలిటీ 4వ వార్డులో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పోటీ చేస్తున్నాయి. ఈ వార్డు ఎస్టీలకు రిజర్వ్ అయింది. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీనును శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయంలో కొందరు కాంగ్రెస్ నేతలు కిడ్నాప్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, ఇన్చార్జి ఇంతియాజ్ ఇసాక్‌కు సమాచారం అందించారు. కిడ్నాప్ వ్యవహారంపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు శ్రీను భార్యతోపాటు బీఆర్ఎస్ నాయకులు వెళ్లగా పోలీసులు స్వీకరించలేదు. మరోవైపు, బీజేపీ అభ్యర్థి రాములునాయక్ కూడా కిడ్నాప్ అయ్యారంటూ ఆ పార్టీ నేతలు కూడా పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు.
కాంగ్రెస్ అభ్యర్థి ఎక్కడ ఓడిపోతాడోననే భయంతోనే ఈ ఇద్దరినీ కాంగ్రెస్ నేతలు కిడ్నాప్ చేసినట్టు అప్పటికే సోషల్‌మీడియాలో ప్రచారం జరిగింది. వీరిద్దరి ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ కావడంతో కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. అయితే, కొద్దిసేపట్లోనే సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి ముందు వీరిద్దరూ ప్రత్యక్షమయ్యారు. వీరికి కాంగ్రెస్ నేతలు కండువా కప్పి పార్టీలో చేరినట్టు ప్రకటించారు. బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులు బీఫారాలు తీసుకుని పోటీకి నిలిచిన అభ్యర్థులకు కాంగ్రెస్ కండువా కప్పడం ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేయడమేనని విపక్షాలు ఆరోపించాయి. ఇది అనైతిక చర్య అంటూ బీఆర్ఎస్ నేతలు ధర్నాకు దిగారు. ‘అభ్యర్థులెవరూ కిడ్నాప్ కాలేదు. వారి ఇష్టానుసారమే కాంగ్రెస్‌లో కలిశారు. ధర్నా చేస్తే మీపై కేసులు పెడతాం’ అని పోలీసులు బెదిరింపులకు దిగారు. దీంతో పోలీసులు, సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి డైరెక్షన్లోనే కిడ్నాప్ చేసి, బలవంతంగా పార్టీ మార్పించారనే చర్చ నడుస్తున్నది. కోస్గి మున్సిపాలిటీలో గెలుస్తామో, లేదోనన్న భయంతో సీఎం సోదరుడు ఈ కిడ్నాప్‌లకు పాల్పడినట్టు బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు బీజేపీ నేతలు ఈ వ్యవహారంపై సైలెంట్‌గా ఉండటం పలు అనుమానాలకు తావిస్తున్నది.
ఇదెక్కడి ప్రజాస్వామ్యం? : పట్నం
కొడంగల్‌లో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ తరఫున బీ ఫారం ఇచ్చిన అభ్యర్థిని ఎత్తుకుపోయే పరిస్థితి కాంగ్రెస్‌కు ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. కోస్గిలో ఆయన పార్టీ ఇన్చార్జి ఇంతియాజ్ ఇసాక్‌తో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. ‘మీకు అభ్యర్థులు దొరుకుతలేరా? మీ అభ్యర్థి అక్కడ పోటీ చేస్తుండగా.. మా అభ్యర్థిని తీసుకుపోవడం ఏమిటి? ఇదెక్కడి ప్రజాస్వామ్యం?’ అని నిలదీశారు. తమ అభ్యర్థికి కాంగ్రెస్ కండువా ఎందుకు కప్పారో చెప్పాలని డిమాండ్ చేశారు.