మెదక్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): సాగు నీళ్లు లేక ఘనపూర్ ఆయకట్టు ఆగమైతుందని మెదక్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సింగూర్ ప్రాజెక్టు నుంచి 0.3 టీఎంసీల నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజావాణిలో భాగంగా సోమవారం ఆమె బీఆర్ఎస్ నాయకులతో కలెక్టరేట్‌కు వెళ్లి కలెక్టర్ ప్రతిమాసింగ్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. యాసంగిలో రైతులు ఘనపూర్ ఆయకట్టు కింద వేల ఎకరాల్లో వరి, ఇతర పంటలు సాగుచేసినట్టు తెలిపారు. ఘనపూర్ ప్రాజెక్టులో నీటి నిల్వ లేక రైతులు సాగుచేసిన పంటలు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ డిమాండ్ మేరకు ప్రభుత్వం సింగూర్ ప్రాజెకు నుంచి నీటిని విడుదల చేసినా సంగారెడ్డి సమీపంలో ఉన్న మంజీరా డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడం లేదని తెలిపారు.
హైదరాబాద్ అవసరాల కోసం మంజీరా డ్యామ్‌లో నీటి నిల్వ ఉంచామని అధికారులు చెప్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే మంజీరా డ్యామ్ నుంచి ఘనపూర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వం ముందుగా క్రాప్ హాలిడే ప్రకటించి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులు వరిసాగు చేసిన తర్వాత ప్రభుత్వం ఘనపూర్ ఆయకట్టు కింద వరి సాగు చేయరాదని క్రాప్ హాలిడే ప్రకటించడం సరికాదని అన్నారు. ఆయకట్టు రైతులకు ప్రభుత్వం పంట నష్ట పరిహారం చెల్లించాలని కోరారు. సింగూర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అసెంబ్లీలో కోరగా ప్రభుత్వం కమిటీ వేసి నీటిని విడుదల చేస్తామని ప్రకటించిందని, అయినప్పటికీ జిల్లా అధికారులు చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. ఆమె వెంట జడ్పీ మాజీ చైర్పర్సన్ లావణ్యారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, బీఆర్ఎస్ పట్టణ కన్వీనర్ మామిండ్ల ఆంజనేయులు తదితరులు ఉన్నారు.